చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అర్ధాంగి సుధారెడ్డి తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ కోరకుండా వదిలేసి తాను పెద్ద తప్పు చేశానని ఆమె పేర్కొన్నారు.

తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలను సుధారెడ్డి మీడియా ముందు ప్రస్తావించారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా కౌంటింగ్ రూమ్‌ను మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశామని చెప్పారు. కేవలం 600 ఓట్ల స్వల్ప తేడాతోనే ఫలితం తేలిందని, పైగా 2 వేలకు పైగా ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆమె గుర్తుచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కచ్చితంగా రీకౌంటింగ్ కోరాలని తాను గట్టిగా భావించినట్లు తెలిపారు.

అయితే, ఆ సమయంలో చెవిరెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి తమను బతిమాలడంతోనే రీకౌంటింగ్ విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని సుధారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే తమ పెద్ద కొడుకు ఎన్నికల్లో ఓడిపోయాడని, ఇప్పుడు చిన్న కొడుకు కూడా ఓడిపోతే తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడని చెవిరెడ్డి కుటుంబీకులు ప్రాధేయపడ్డారని ఆమె తెలిపారు. వారి పరిస్థితిని అర్థం చేసుకుని, కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించే రీకౌంటింగ్ పిటిషన్ దాఖలు చేయలేదని సుధారెడ్డి వివరించారు. ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా తాము తప్పు చేశామని ఆమె ఇప్పుడు వ్యాఖ్యానించారు. సుధారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.