ఏపీ పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలుపొందగా.. మరికొన్ని చోట్ల కుటుంబ సభ్యుల మధ్యే రాజకీయ పోరు సాగింది. ఒకచోట తండ్రి, కుమార్తె విజయం సాధించగా.. మరోచోట తోడికోడళ్ల మధ్య జరిగిన పోటీలో కూటమి అభ్యర్థి గెలిచారు.

ఎన్టీఆర్‌ జిల్లా గణపవరంలో 20 ఏళ్ల తర్వాత టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ గ్రామం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరి, జగన్‌ మేనత్త విమలమ్మ స్వగ్రామం కావడం గమనార్హం. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో టీడీపీ అభ్యర్థి అరుణ రీకౌంటింగ్‌ తర్వాత ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. తొలుత ఆరు ఓట్ల తేడా రావడంతో అధికారులు మళ్లీ లెక్కింపు చేపట్టారు. ఫలితం వెలువడిన తర్వాత వైకాపా అభ్యర్థి కౌంటింగ్‌ కేంద్రం వద్ద బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.

తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చంద్రవరం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కాట్రూ శ్రీనివాసరావు కేవలం మూడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు, పాంచాలి ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన తండ్రి జి.యుగంధర్‌, కుమార్తె కావ్య గెలుపొందారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లంలో తోడికోడళ్ల మధ్య జరిగిన పోరులో జనసేన అభ్యర్థి బోడపాటి మంగదేవి 18 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి 1, 2 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు తుమ్మ కల్పన, గొడుగుల బంగార్రాజు గెలుపొందారు. నక్కపల్లి-2 పరిధిలోనే హోంమంత్రి అనిత నివాసం ఉండటం గమనార్హం.

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏఎం రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్‌ బాక్సులో ఓట్లతోపాటు కరపత్రాలు బయటపడ్డాయి. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్‌ బాక్సుల్లో ఈ కరపత్రాలను గుర్తించారు. గ్రామానికి వెళ్లే రహదారిలో రైల్వే గేటు వద్ద యూ ఆకారంలో అండర్‌పాస్‌ నిర్మించవద్దని, ప్రధాన రహదారికి అనుసంధానంగా బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు వాటిలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ స్పందించాలని కోరారు.

తిరుపతి రూరల్‌ జడ్పీటీసీ స్థానంలో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి, టీడీపీ అభ్యర్థి ధనలక్ష్మి తరఫున వారి కుటుంబ సభ్యులు కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చి లెక్కింపును పరిశీలించారు. మరోవైపు పోస్టల్‌ బ్యాలెట్లలో చెల్లని ఓట్లు భారీగా నమోదయ్యాయి. అల్లూరి జిల్లా అనంతగిరిలో 137 పోస్టల్‌ ఓట్లకు 91 చెల్లనివిగా తేలాయి.