అర్నబ్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. తుపాను ధాటికి దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు సహకారం అందించాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి పట్ల రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే స్పందించింది. ఈ మేరకు ఏపీకి ప్రత్యేక బృందాలను పంపింది.

అర్నబ్ తుపాను ప్రభావంతో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం సహా పలు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, సుమారు 16,000లకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ నేపథ్యంలో, విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఫోన్‌లో మాట్లాడి సహాయం కోరారు.

ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తిపై భట్టి విక్రమార్క వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏపీకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. టీజీఎస్పీడీసీఎల్ నేతృత్వంలోని ఈ బృందాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరి, కూలిపోయిన స్తంభాలు, తెగిపడిన తీగల మరమ్మతు పనుల్లో పాల్గొంటున్నాయి.

ప్రస్తుతం ఏపీలో 1,700 మంది స్థానిక సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమవ్వగా, మరో 500 మందిని ఇతర డిస్కంల నుంచి రప్పిస్తున్నారు. వీరికి తోడుగా తెలంగాణ సిబ్బంది కూడా చేరడంతో పనులు వేగవంతమయ్యాయి. వీలైనంత త్వరగా, వీలైతే 24 గంటల్లోనే విద్యుత్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ఇరు రాష్ట్రాల సిబ్బంది కలిసికట్టుగా పనిచేస్తున్నారు.