దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ హైదరాబాద్‌లోని పలు స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నారని గుర్తించి... నగరంలో ఎంతో పేరున్న జి. పుల్లారెడ్డి స్వీట్స్ సహా పలు సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నారు. పుల్లారెడ్డి స్వీట్స్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు.

టీజీ సేఫ్ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్), పోలీసులతో కూడిన 13 బృందాలు జీహెచ్ఎంసీ పరిధిలోని 16 ప్రధాన స్వీట్ షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో మొత్తం రూ.16.86 లక్షల విలువైన 3,546 కిలోల కల్తీ, పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు 5 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయగా, లైసెన్సులు లేకుండా నడుస్తున్న మరో 5 షాపులను మూసివేశారు.

సనత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్ తయారీ యూనిట్‌లో కుళ్లిన కూరగాయలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన పదార్థాలను గుర్తించిన అధికారులు నిర్ఘాంతపోయారు. వంటగది, శుభ్రపరిచే ప్రదేశాలు అత్యంత అపరిశుభ్రంగా ఉండటంతో లైసెన్సును తక్షణమే సస్పెండ్ చేశారు. ఇక్కడి నుంచే ఏకంగా రూ.15.03 లక్షల విలువైన 3,133 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

చార్మినార్‌లోని ఆగ్రా మిఠాయి ఘర్, వనస్థలిపురంలోని స్వీట్ వన్ రుచులు, ఫలక్‌నుమాలోని బాలాజీ శ్రీ కిషన్ మిఠాయి భండార్, కాటేదాన్‌లోని హిరాణి ఫుడ్స్ లైసెన్సులను కూడా సస్పెండ్ చేశారు. వీటితో పాటు లైసెన్సులు లేకుండా అపరిశుభ్రంగా నడుపుతున్న చాంపపేట్‌లోని బాలాజీ స్వీట్స్, సికింద్రాబాద్‌లోని మమతా స్వీట్ హౌస్ సహా మరో మూడు దుకాణాలను అధికారులు మూసివేయించారు. తనిఖీల్లో భాగంగా 22 ఆహార నమూనాలను సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.