ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం మరో ముగ్గురు వ్యక్తులకు ఉరిశిక్షను అమలు చేసింది. గత జనవరి నెలలో చోటుచేసుకున్న తీవ్ర నిరసనల సమయంలో సాయుధ తిరుగుబాటుకు పాల్పడ్డారన్న అభియోగాలపై హసన్ దియోబంద్, హమీద్ కజెమి, రెజా జంగనేహ్ అనే ముగ్గురిని ఉరితీసినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది.

టెహ్రాన్‌కు పశ్చిమాన ఉన్న కరాజ్ నగరంలో జరిగిన ఆందోళనల్లో ఈ ముగ్గురూ పెట్రోల్ బాంబులు (మోలోటోవ్ కాక్‌టెయిల్స్), గ్రెనేడ్లు విసిరారని, పదునైన ఆయుధాలు, తుపాకులు ఉపయోగించారని, ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారని అక్కడి న్యాయస్థానం నిర్ధారించింది. అంతేకాకుండా, నిందితులు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో పాటు ఇతర శత్రుత్వ గ్రూపుల ఆదేశాలతో పనిచేశారని ఇరాన్ అధికారులు ఆరోపించారు. వీరి నేరారోపణలను ఇరాన్ సుప్రీంకోర్టు సమర్థించడంతో శిక్షను అమలు చేశారు.

దేశంలో నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం భారీగా పెరగడంతో గతేడాది డిసెంబర్‌లో ప్రజాందోళనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే అవి విస్తృత ప్రభుత్వ వ్యతిరేక నిరసనలుగా మారి, జనవరి 8, 9 తేదీల్లో ఉధృతరూపం దాల్చాయి. ఈ ఆందోళనలు, ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ అధికార యంత్రాంగం పేర్కొంది. అయితే వీటి వెనుక అమెరికా, ఇజ్రాయెల్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు ఉన్నాయని ప్రభుత్వం ఆరోపించగా.. అసలు మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. భద్రతా దళాలు నిరాయుధులైన నిరసనకారులపై కాల్పులు జరిపినట్లు వెల్లడైన వివరాలను బీబీసీ తన కథనంలో ప్రస్తావించింది.

ఈ నిరసనలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు వరుసగా ఉరిశిక్షలు అమలు చేస్తుండటంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇరాన్‌లో మరణశిక్షల సంఖ్య భారీగా పెరుగుతుండటంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి మధ్యకాలం నుంచి ఇప్పటివరకు దేశ భద్రతకు ముప్పు కలిగించారనే ఆరోపణలతో కనీసం 56 మందికి మరణశిక్ష అమలు చేయగా, అందులో 27 మంది జనవరి నిరసనలతో సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, గతేడాది ఒక్క సంవత్సరంలోనే ఇరాన్ కనీసం 2,159 మరణశిక్షలను అమలు చేసింది. 1981 తర్వాత ఆ దేశంలో నమోదైన అత్యధిక ఉరిశిక్షల సంఖ్య ఇదే కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత ఇరాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది.