ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళిని ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలతో కలిసి జరుపుకొన్నారు. వరుసగా 13వ ఏడాది ఆయన సైనికులు, భద్రతా సిబ్బందితో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావం పూర్తిగా తొలగిన తర్వాత బస్తర్‌లో జరుగుతున్న తొలి దీపావళి కావడంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

బస్తర్‌లోని కరణ్‌పూర్‌ కోబ్రా ఆపరేషన్స్‌ బేస్‌ను మోదీ సందర్శించారు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావానికి కేంద్రంగా ఉన్న బస్తర్‌, అబుజ్‌మడ్‌ ప్రాంతాల్లో ఎదురుదాడి చర్యలకు ఈ కేంద్రం శిక్షణ స్థావరంగా, కీలక కేంద్రంగా పనిచేసింది. అక్కడ భద్రతా సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారి త్యాగాలకు, అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపేందుకు బస్తర్‌ అడవులకు వచ్చానని చెప్పారు.

దేశవ్యాప్తంగా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకొంటున్నారని, విధి నిర్వహణలో భాగంగా కుటుంబాలకు దూరంగా ఉన్న భద్రతా సిబ్బందితో ఈ పండుగను పంచుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. దేశ సరిహద్దులను కాపాడుతున్నవారు, అంతర్గత భద్రతను పరిరక్షిస్తున్నవారు తన కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. “ప్రతి సైనికుడు నా కుటుంబంలో ఒకరు” అని మోదీ స్పష్టం చేశారు.

2026 దీపావళి చరిత్రాత్మకమని ప్రధాని అభివర్ణించారు. దశాబ్దాలుగా దేశాన్ని వేధించిన నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదంపై పోరులో విజయం సాధించిన తర్వాత వస్తున్న తొలి దీపావళి ఇదేనన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో నక్సలిజం ప్రభావం తొలగిపోయిందని పేర్కొన్నారు. ఒకప్పుడు మావోయిస్టు హింసతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డారని చెప్పారు. ఈ విజయానికి భద్రతా బలగాల త్యాగాలు, నిరంతర కృషే ప్రధాన కారణమని కొనియాడారు.

బస్తర్‌లో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకున్నాయని మోదీ అన్నారు. దేశ అంతర్గత భద్రత బలంగా ఉంటేనే బాహ్య శత్రువులు విజయవంతం కాలేరని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో సైన్యం చేసే సేవలతో సమానంగా దేశంలో అంతర్గత భద్రతను కాపాడే బలగాల పాత్ర కూడా కీలకమని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

గతేడాది గోవాలోని ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో నౌకాదళ సిబ్బందితో మోదీ దీపావళి జరుపుకొన్నారు. 2014 నుంచి 2025 వరకు 12 సార్లు వివిధ ప్రాంతాల్లో సైనికులతో ఈ పండుగలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడుసార్లు, హిమాచల్‌ప్రదేశ్‌, లడఖ్‌లో రెండేసిసార్లు పర్యటించారు.