హైదరాబాద్ లో పండ‌గ పూట‌ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడగా, శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే.. గోపన్‌పల్లిలోని జయభేరి అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న బట్టుల మారెడ్డి (65), ఆయన భార్య భారతి (60), వారి కుమారుడు నిశాంత్ రెడ్డి (38) తమ ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యల కారణంగానే వీరు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 మ‌రో ఘ‌ట‌న‌లో బాచుపల్లి ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో సూర్య అనే ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న యువతికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.