ప్రజాసేవలో ప్రధాని మోదీ పాతికేళ్లు.. లోకేశ్ ప్రత్యేక పూజలు

ప్రజాసేవలో ప్రధాని మోదీ పాతికేళ్లు.. లోకేశ్ ప్రత్యేక పూజలు

PM Modi 25 years in public service Nara Lokesh performs special prayers
  • ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి
  • వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి లోకేశ్ ప్రత్యేక పూజలు
  • మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థన
  • ప్రధానిని 'ఆధునిక ఉక్కు మనిషి'గా అభివర్ణించిన లోకేశ్
  • వికసిత్ భారత్ సంకల్పం నెరవేరాలని ఆకాంక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన, ప్రధాని మోదీ పేరు మీద అర్చన జరిపించి స్వామివారిని దర్శించుకున్నారు.

2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ ప్రస్థానం ప్రారంభమై, నేటితో 25 ఏళ్లు (రజతోత్సవం) పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో లోకేశ్ పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన తలపెట్టిన 'వికసిత్ భారత్' వజ్రసంకల్పం నెరవేరాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రధాని మోదీని 'ఆధునిక ఉక్కు మనిషి'గా అభివర్ణించిన లోకేశ్, ప్రపంచంలోనే దేశాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలనే లక్ష్యంతో ఆయన నిస్వార్థంగా పనిచేస్తున్నారని అన్నారు. ఆయనకు దేవుడు మరిన్ని శక్తియుక్తులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'సేవా సంకల్ప్ యాత్ర' నిర్వహించడం దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని లోకేశ్ వ్యాఖ్యానించారు.
  
Advertisement
Narendra Modi
Nara Lokesh
Amaravati
25 Years Public Service
Silver Jubilee
Andhra Pradesh

More Telugu News