ఏపీ పోలీసు వ్యవస్థలో కీలక మార్పు.. కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు

ఏపీ పోలీసు వ్యవస్థలో కీలక మార్పు.. కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు

Andhra Pradesh Police system changes with four new commissionerates
  • గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరంలో నూతన కమిషనరేట్లు
  • ఐజీ/డీఐజీ స్థాయి అధికారులకు కమిషనర్ బాధ్యతలు
  • కొత్త పోస్టులు లేకుండా ఉన్నవాటితోనే సర్దుబాటు
  • రాష్ట్రంలో ఆరుకు చేరిన మొత్తం పోలీస్ కమిషనరేట్ల సంఖ్య
ఏపీలో పోలీసు పాలనా వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం నగరాలు ఇకపై పోలీస్ కమిషనర్ల పర్యవేక్షణలోకి రానున్నాయి. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నూతన కమిషనరేట్లకు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) లేదా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తారు. వీరికి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్‌) సెక్షన్ 14(6) కింద ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలను కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ, పోలీసు జిల్లాల సరిహద్దులనే ఈ కొత్త కమిషనరేట్ల పరిధిగా నిర్ణయించారు.

ఈ కమిషనరేట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పోస్టులను సృష్టించకపోవడం గమనార్హం. ప్రస్తుతం వివిధ విభాగాల్లో అదనంగా ఉన్న క్యాడర్ పోస్టులనే సర్దుబాటు చేసి, వాటిని కమిషనర్ పోస్టులుగా మార్చారు. ఉదాహరణకు, తిరుపతి కమిషనర్ పోస్టుకు విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ పోస్టును, గుంటూరు కమిషనర్ పోస్టుకు శిక్షణ విభాగం డీఐజీ పోస్టును కేటాయించారు. అదేవిధంగా రాజమహేంద్రవరం, కర్నూలు కమిషనర్ పోస్టులను కూడా ఇతర విభాగాల నుంచి బదలాయించారు.

తిరుపతి కమిషనరేట్ పరిధిలోకి తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీసిటీ జోన్లు వస్తాయి. పెరుగుతున్న భక్తుల రద్దీ, ట్రాఫిక్, వీఐపీ భద్రత, శాంతిభద్రతల సమర్థ నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు కమిషనరేట్ పరిధిలో గుంటూరు, అమరావతి, తెనాలి జోన్లు ఉంటాయి. 

రాజమహేంద్రవరం, కర్నూలు కమిషనరేట్ల పరిధిలోకి కూడా ఆయా నగరాలతో పాటు పరిసర ప్రాంతాలను చేర్చారు. పాలనా సౌలభ్యం, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ విస్తరణ చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇప్పటికే రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పోలీస్ కమిషనరేట్లు ఉండగా, తాజా నిర్ణయంతో వాటి సంఖ్య ఆరుకు చేరింది. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త కమిషనరేట్లకు అవసరమైన డీసీపీలు, ఏసీపీలు, ఇతర సిబ్బందిని కూడా సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Advertisement
Andhra Pradesh Police
New Police Commissionerates
Guntur Tirupati Kurnool Rajamahendravaram
AP Government Home Department
Police Administrative Reforms
BNSS Executive Magistrate Powers

More Telugu News