కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నవంబర్ 1 నుంచి కఠిన నిబంధనలు

కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నవంబర్ 1 నుంచి కఠిన నిబంధనలు

Delhi Government Key Decision On Pollution Strict Rules From November 1
  • ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు ముందస్తు చర్యలు
  • నవంబర్ 1 నుంచి రెట్టింపు కానున్న పార్కింగ్ ఛార్జీలు
  • ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు
  • నిర్మాణ, కూల్చివేత పనులపై పూర్తిగా నిషేధం
  • ఫిబ్రవరి 28 వరకు అమలులో ఉండనున్న నిబంధనలు
ప్రతి ఏటా శీతాకాలంలో తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ముందస్తు నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. కాలుష్య తీవ్రతను తగ్గించే లక్ష్యంతో 2026 నవంబర్ 1వ తేదీ నుంచి కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయడంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్త నిబంధనల ప్రకారం, నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కేవలం 50 శాతం సిబ్బందితోనే కార్యకలాపాలు సాగించాలి. మిగిలిన 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. వీటితో పాటు, నగర వ్యాప్తంగా భవన నిర్మాణ, కూల్చివేత పనులపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. వాహనాల వినియోగాన్ని నియంత్రించేందుకు ఈ కాలంలో పార్కింగ్ ఫీజులను కూడా రెట్టింపు చేయనున్నట్లు వెల్లడించింది.

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాలను కాల్చడం, వాహన కాలుష్యం, నిర్మాణ రంగ ధూళి, దీపావళి బాణసంచా, పారిశ్రామిక ఉద్గారాల వంటి కారణాలతో ఢిల్లీ నగరం ప్రతి ఏటా గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు శ్వాసకోశ సమస్యలు బారిన పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ చర్యల ద్వారా శీతాకాలంలో కాలుష్య తీవ్రతను కొంతమేరకైనా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Advertisement
Delhi Government
Delhi Air Pollution
Work From Home Rules
Parking Charges Hike
Construction Ban Delhi

More Telugu News