యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో బొగ్గు కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: జగదీశ్‌ రెడ్డి

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో బొగ్గు కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: జగదీశ్‌ రెడ్డి

Jagadish Reddy blames Congress government for coal shortage in Yadadri Thermal Power Plant
  • ఈరోజు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన జగదీశ్ రెడ్డి
  • విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శ
  • 40 లక్షల టన్నుల బొగ్గును పక్కదారి పట్టిస్తున్నారని మండిపాటు

నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఎదురవుతున్న బొగ్గు కొరతకు, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.


ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన ఈరోజు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను స్వయంగా పరిశీలించారు. అనంతరం ప్లాంట్ అధికారులతో సమావేశమై విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి గల సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు.


ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి సంస్థ నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, ప్లాంట్లకు సక్రమంగా సరఫరా చేయకుండా దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గును పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని పవర్ ప్లాంట్లకు బొగ్గు కొరత సృష్టించి, ప్రజలను ముఖ్యంగా రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగానైతే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను అందించిందో, అదే రీతిలో పవర్ ప్లాంట్లకు పూర్తిస్థాయిలో బొగ్గు సరఫరా చేసి నిరంతర విద్యుత్ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Advertisement
Jagadish Reddy
Yadadri Thermal Power Plant
Telangana Coal Shortage
Congress Government Telangana
Singareni Collieries
BRS Party News

More Telugu News