వందే భారత్ రైల్లో మంటలు, పొగ.. విజయవాడ వద్ద నిలిపివేత

వందే భారత్ రైల్లో మంటలు, పొగ.. విజయవాడ వద్ద నిలిపివేత

Vande Bharat Express fire and smoke train stopped at Vijayawada
  • నర్సాపూర్-చెన్నై వందే భారత్ రైలులో స్వల్ప అగ్నిప్రమాదం
  • విజయవాడ సమీపంలో కోచ్ చక్రాల మధ్య చెలరేగిన మంటలు
  • పొగలు వ్యాపించడంతో ప్రయాణికుల తీవ్ర ఆందోళన
  • ప్రయాణికులంతా సురక్షితం, ఊపిరి పీల్చుకున్న అధికారులు
  • మరో రైలులో ప్రయాణికులను చెన్నైకి పంపేందుకు ఏర్పాట్లు
నర్సాపూర్ నుంచి చెన్నై వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. విజయవాడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే, రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బుధవారం సాయంత్రం వందే భారత్ రైలు విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైలులోని సీ-4 కోచ్ చక్రాల ఇరుసు వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.

అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే రైలును విజయవాడ స్టేషన్‌లో నిలిపివేశారు. అగ్నిమాపక పరికరాల సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ముందుజాగ్రత్త చర్యగా, ప్రమాదానికి గురైన రైలును స్టేషన్‌లోనే నిలిపి ఉంచి సాంకేతిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను వారి గమ్యస్థానమైన చెన్నైకి చేర్చేందుకు ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Advertisement
Vande Bharat Express
Vijayawada Railway Station
Train Fire Accident
Narsapur Chennai Vande Bharat
Indian Railways

More Telugu News