శుక్రవారం హైదరాబాద్ లో వైన్ షాపులు, బార్లు బంద్
- ఈ నెల 25న హైదరాబాద్ లో గణేశ్ మహా నిమజ్జనం
- జంట నగరాల పరిధిలో మద్యం విక్రయాలు బంద్
- స్టార్ హోటళ్లు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 25న (శుక్రవారం) జరగనున్న ప్రధాన గణేశ్ మహా నిమజ్జనం కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు పలు ముఖ్యమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.
మహా నిమజ్జనం, భారీ శోభాయాత్రల వల్ల నగరంలో ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 25న తెలంగాణ హైకోర్టుతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని సబార్డినేట్ కోర్టులన్నింటికీ సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవుకు బదులుగా డిసెంబర్ 5వ తేదీ శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రకటించారు.
మరొకవైపు ప్రశాంత వాతావరణంలో వేడుకలు పూర్తి కావడానికి వీలుగా మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 25న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులలోని బార్లకు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు.