ఇది ఎల్ నినో కాదు.. కాంగ్-నినో: రాష్ట్రంలో కరెంట్ కోతలపై కేటీఆర్

ఇది ఎల్ నినో కాదు.. కాంగ్-నినో: రాష్ట్రంలో కరెంట్ కోతలపై కేటీఆర్

KTR says this is not El Nino but Kang Nino on power cuts in Telangana
  • రాష్ట్రంలో కరెంట్ కోతలకు 'కాంగ్-నినో' కారణమన్న కేటీఆర్
  • కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయిందంటూ ప్రభుత్వానికి చురక
  • సింగరేణి నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని ఆరోపణ
  • జెన్‌కో వద్ద బొగ్గు నిల్వలు లేవని, థర్మల్ ప్లాంట్లు మూసేశారని విమర్శ
  • రైతులకు 24 గంటల విద్యుత్ హామీని నెరవేర్చాలని డిమాండ్
రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది 'ఎల్ నినో' ప్రభావం కాదని, పాలకుల అసమర్థత వల్లే తలెత్తిన 'కాంగ్-నినో' (కాంగ్రెస్ నినో) అని ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.

"కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యుత్ కోతలు తప్పవని తాము ముందే హెచ్చరించామని, ఇప్పుడు అదే నిజమవుతోందని" కేటీఆర్ పేర్కొన్నారు. "కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది" అంటూ ఆయన ప్రభుత్వానికి చురకలంటించారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా నడిచిందని, కానీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి దారుణంగా మారిందని విమర్శించారు. అనేక సబ్‌స్టేషన్ల పరిధిలో రోజుకు 6 గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదని పత్రికల్లో వస్తున్న కథనాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

విద్యుత్ కోతలకు ప్రభుత్వం ఎల్ నినోను సాకుగా చూపుతోందని, అయితే అసలు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని కేటీఆర్ ఆరోపించారు. జెన్‌కో వద్ద తగినంత బొగ్గు నిల్వలు లేవని, సింగరేణి నుంచి ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ థర్మల్ విద్యుత్ కేంద్రాలను, నీరు లేదన్న సాకుతో జల విద్యుత్ కేంద్రాలను మూసివేశారని దుయ్యబట్టారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీని ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Advertisement
KTR
Telangana power cuts
Congress government
Kang Nino
BRS party
Telangana electricity crisis

More Telugu News