రైతుల పోరాటంతోనే ప్రభుత్వం దిగొచ్చింది: జూరాల నీటి విడుదలపై కేటీఆర్

రైతుల పోరాటంతోనే ప్రభుత్వం దిగొచ్చింది: జూరాల నీటి విడుదలపై కేటీఆర్

KTR says government bowed to farmers struggle over Jurala water release
  • జూరాల కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసిన ప్రభుత్వం
  • పోరాడితో పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అన్న కేటీఆర్
  • రైతుల ఉద్యమ ఒత్తిడి వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని వ్యాఖ్య

జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు నీటిని విడుదల చేసిన పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. "పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప" అనే ప్రసిద్ధ నినాదాన్ని గుర్తుచేస్తూ... తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన పాలమూరు అన్నదాతల పోరాట పటిమ గొప్పదని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. కాలువలకు నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్న విపత్కర పరిస్థితుల్లో రైతులు చేసిన సమరశీల పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు.


రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ ప్రభుత్వాన్ని రైతులు ముల్లుగర్రతో తట్టి నిద్రలేపి, నీటిని విడుదల చేసేలా పరుగులు పెట్టించారని కేటీఆర్ ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నిర్బంధాలను సైతం ఎదుర్కొని రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించడం, తెలంగాణ ప్రజల కనీస అవసరాలను తీర్చేలా ఈ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించడమే రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. రైతుల ఉద్యమ ఒత్తిడి వల్లే ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Advertisement
KTR
Jurala Project
Telangana Farmers Protest
BRS Party
Jurala Water Release
Palamuru Farmers

More Telugu News