రూ. 2,700 క్యాన్సర్ మందును రూ. 27 వేలకు అమ్ముతారా?: సుప్రీంకోర్టు ఆగ్రహం

రూ. 2,700 క్యాన్సర్ మందును రూ. 27 వేలకు అమ్ముతారా?: సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court slams selling cancer drug for 27000 which costs 2700
  • ఔషధాల తయారీ ధరకూ, ఎంఆర్‌పీకి మధ్య భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • దీనిని 'పట్టపగలే దోపిడీ'గా అభివర్ణించిన ధర్మాసనం
  • ధరల నియంత్రణ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీత
ఔషధాల తయారీ ధరకూ, వాటిపై ముద్రించే గరిష్ట చిల్లర ధరకు (ఎంఆర్‌పీ) మధ్య పది రెట్ల వరకు వ్యత్యాసం ఉండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తయారీదారులు కేవలం రూ. 2,700కు అమ్మే  క్యాన్సర్ మందుపై రిటైలర్లు రూ. 27 వేల ఎంఆర్‌పీ ముద్రించి విక్రయించడాన్ని ‘పట్టపగలే దోపిడీ’గా అభివర్ణించింది. 

మందుల ధరల నియంత్రణ, జనరిక్ మందులు, వైద్య పరికరాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ మెహతా మాట్లాడుతూ.. "కొన్ని అత్యవసర క్యాన్సర్ మందుల ఎంఆర్‌పీ రూ.27,000 ఉంటే, రిటైలర్‌కు అమ్మే ధర (పీటీఆర్) రూ.2,700గా ఉంది. ఇది కచ్చితంగా పట్టపగలే దోపిడీ. తయారీదారు నుంచి రిటైలర్‌కు పదింతలు తక్కువ ధరకు వచ్చే మందును రోగికి ఇంత అధిక ధరకు ఎలా అమ్ముతారు?" అని ప్రశ్నించారు. ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ ధరలను నియంత్రించాల్సిన అధికారులు మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని, దానికి కారణాలు తాము చెప్పాల్సిన అవసరం లేదని ధర్మాసనం చురక అంటించింది.

పిటిషనర్లలో ఒకరైన కిషన్ చంద్ జైన్ వాదనలు వినిపిస్తూ, నియంత్రిత జాబితాలో లేని మందుల ప్రారంభ ధరను నిర్ణయించేందుకు ఎలాంటి సమర్థమైన యంత్రాంగం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. "ఒక కంపెనీ కొత్త మందును మార్కెట్లోకి తెస్తే, దాని ధరను రూపాయిగా లేదా వెయ్యి రూపాయలుగా అయినా నిర్ణయించుకోవచ్చు. దానిని నియంత్రించే వ్యవస్థ లేదు" అని ఆయన వివరించారు. కొన్ని మందుల ఎంఆర్‌పీ రూ.73 ఉంటే, రిటైలర్ ధర రూ. 22.75 మాత్రమేనని చెబుతూ కోర్టుకు కొన్ని ఆధారాలు సమర్పించారు.

ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాదనలు వినిపించారు. ఈ కేసును తాము వ్యతిరేకంగా చూడటం లేదని, ప్రస్తుత వ్యవస్థలో మెరుగుపరచాల్సిన అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ, అధిక ధరలకు తయారీదారులు బాధ్యులు కాదని, రిటైలర్లే ఎక్కువ లాభాలు పొందుతున్నారని అన్నారు. అయితే, సిబల్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. మందులపై ఎంఆర్‌పీని ముద్రించేది తయారీదారులే అయినప్పుడు, వారెలా బాధ్యులు కారని ప్రశ్నించింది.

ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, కపిల్ సిబల్ తమ వాదనలు వినిపించనున్నారు.  
Advertisement
Supreme Court of India
Cancer Drug Prices
Medicine MRP
Pharmaceutical Industry
Drug Price Control
Healthcare India

More Telugu News