డేటా లేకుండా తక్కువ వ్యాలిడిటీతో ప్రత్యేక వోచర్లు.. టెలికం సంస్థలకు కొత్త నిబంధనలు జారీ

డేటా లేకుండా తక్కువ వ్యాలిడిటీతో ప్రత్యేక వోచర్లు.. టెలికం సంస్థలకు కొత్త నిబంధనలు జారీ

TRAI issues new rules for special vouchers with low validity and no data
  • తక్కువ వ్యవధి వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ రీచార్జ్‌లకు ట్రాయ్‌ అనుమతి
  • 30 రోజులు, అంతకంటే తక్కువ కాలానికి ఎస్‌టీవీలు
  • తక్కువ ఆదాయ వర్గాలకు మరిన్ని రీచార్జ్‌ ఆప్షన్లు
  • ప్రతి నెల ఒకే తేదీన రీచార్జ్‌ చేసుకునే సదుపాయం
  • ఎక్కువ కాలపరిమితి ఉన్న ఎస్‌టీవీలు కూడా తప్పనిసరి
తక్కువ ఆదాయం ఉన్న టెలికాం వినియోగదారులకు మరిన్ని రీఛార్జ్‌ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. కేవలం వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ అవసరాల కోసం తక్కువ కాలపరిమితితో ‘ప్రత్యేక టారిఫ్‌ వోచర్లు’ (ఎస్‌టీవీలు) అందించాలని టెలికాం సంస్థలను ట్రాయ్‌ ఆదేశించింది. ఈ మేరకు ‘టెలికాం కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ (13వ సవరణ) రెగ్యులేషన్‌-2026’ను మంగళవారం విడుదల చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం 30 రోజుల కాలపరిమితితో పాటు 30 రోజుల కంటే తక్కువ వ్యవధికి కూడా వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ మాత్రమే ఉండే ఎస్‌టీవీలను టెలికాం కంపెనీలు అందించాలి. వినియోగదారులు తమ అవసరానికి తగ్గట్టు, ఆర్థిక స్థితికి అనుగుణంగా రీఛార్జ్‌ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కేంద్ర సమాచార శాఖ తెలిపింది.

ప్రతి నెల ఒకే తేదీన రీఛార్జ్‌ చేసుకునే అవకాశం కూడా ఉండాలి. ఆ తేదీ ఆ నెలలో లేకపోతే చివరి తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌, డేటాతో కూడిన ఎస్‌టీవీలకు అందించే కాలపరిమితికి సరిపోయేలా కనీసం ఒక ఎక్కువ వ్యాలిడిటీ వోచర్‌ కూడా అందుబాటులో ఉంచాలి.

2024లో చేసిన 12వ సవరణ తర్వాత వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ మాత్రమే ఉన్న ఎస్‌టీవీలపై ట్రాయ్‌ సమీక్ష చేపట్టింది. మార్కెట్‌లో ఇలాంటి రీఛార్జ్‌లు తక్కువగా ఉన్నాయని గుర్తించింది. అందులోనూ ఎక్కువ కాలపరిమితి ఉన్న ప్లాన్లే ఎక్కువగా ఉండటంతో తక్కువ వ్యవధి రీఛార్జ్‌లు కోరుకునే వినియోగదారులకు ఆప్షన్లు తగ్గాయని తెలిపింది.

వాటాదారుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తాజా నిబంధనలను ఖరారు చేసినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. డేటా అవసరం లేని వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంచడమే దీని ఉద్దేశమని పేర్కొంది.
Advertisement
TRAI
Telecom Regulatory Authority of India
Special Tariff Vouchers
Telecom companies
Low validity recharge plans
Voice and SMS only vouchers

More Telugu News