ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఇకపై ఏదైనా చాట్‌ను ఓపెన్‌ చేయకుండానే అందులో వచ్చిన తాజా మెసేజ్‌లను చూసుకునే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. ఇందుకోసం ‘చాట్‌ ప్రివ్యూ’ ఫీచర్‌పై సంస్థ పనిచేస్తున్నట్లు టెక్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ సదుపాయం ఐఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్‌ చాట్‌ల జాబితాలో కావాల్సిన సంభాషణపై వేలితో కొద్దిసేపు నొక్కి ఉంచాలి. వెంటనే ప్రత్యేక విండోలో ఆ చాట్‌ ప్రివ్యూ కనిపిస్తుంది. అందులో ఇటీవలి మెసేజ్‌లను పైకి, కిందికి స్క్రోల్‌ చేస్తూ చదువుకోవచ్చు. ఇందుకోసం అసలు చాట్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా మెసేజ్‌ చదివినట్లు అవతలి వ్యక్తికి బ్లూ టిక్స్‌ వెళ్లకుండా చూసుకోవచ్చు. సాధారణంగా చాట్‌ను ఓపెన్‌ చేసినప్పుడే మెసేజ్‌లు చదివినట్లు బ్లూ టిక్స్‌ వస్తాయి.

కేవలం మెసేజ్‌లు చూడటమే కాకుండా.. ప్రివ్యూ తెరిచినప్పుడే పలు పనులు చేసుకునేలా కొత్త ఆప్షన్లను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. చాట్‌ను చదివినట్లు గుర్తించడం, పిన్‌ చేయడం, ఆర్కైవ్‌లోకి పంపడం, సెలెక్ట్‌ చేయడం, డిలీట్‌ చేయడం వంటి సదుపాయాలు ఇందులో ఉండనున్నాయి. అంతేకాకుండా చాట్‌ను లాక్‌ చేయడం, ప్రత్యేక జాబితాలో చేర్చడం, చాట్‌ వివరాలు చూడటం, ఫోన్‌ హోమ్‌స్క్రీన్‌పై షార్ట్‌కట్‌ ఏర్పాటు చేసుకోవడం వంటి అదనపు ఆప్షన్లు కూడా ఉండనున్నట్లు సమాచారం.

వాట్సాప్‌ ఫీచర్లపై సమాచారం అందించే వాబీటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే చాట్‌ ప్రివ్యూ ఫీచర్‌ ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉందని, బీటా టెస్టింగ్‌కు కూడా అందుబాటులోకి రాలేదని నివేదిక పేర్కొంది. కాబట్టి ఇది ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత లేదు.