ఒక్క నిమిషంలో 100 కి.మీ సరిపడా ఛార్జింగ్‌.. చైనా బ్యాటరీ కంపెనీ సంచలనం!

ఒక్క నిమిషంలో 100 కి.మీ సరిపడా ఛార్జింగ్‌.. చైనా బ్యాటరీ కంపెనీ సంచలనం!

Sunwoda EVB 100 km charging in one minute Chinese battery company sensation
  • 15సీ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీని ఆవిష్కరించిన సన్‌వోడా
  • 5 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం ఛార్జింగ్‌ సాధ్యమని వెల్లడి
  • 9 నిమిషాల్లో 97 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుందంటున్న కంపెనీ
  • మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌లోనూ 15 నిమిషాల్లో 97 శాతం ఛార్జింగ్‌
  • 10 ఏళ్లు లేదా 3 లక్షల కి.మీ. వారంటీకి అనుకూలమని కంపెనీ ప్రకటన
విద్యుత్‌ వాహనాలు కొనేవారికి ఛార్జింగ్‌ సమయం పెద్ద సమస్య. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితికి త్వరలో చెక్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన సన్‌వోడా ఈవీబీ కొత్త బ్యాటరీ టెక్నాలజీని ఆవిష్కరించింది. ఇది నిమిషానికి దాదాపు 100 కిలోమీటర్ల డ్రైవింగ్‌ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

9 నిమిషాల్లో 97 శాతం ఛార్జింగ్‌
షాన్‌డాంగ్‌లోని జావోజువాంగ్‌లో జరిగిన బ్యాటరీ పరిశ్రమ సదస్సులో సన్‌వోడా ఈవీబీ 15సీ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ టెక్నాలజీని ప్రదర్శించింది. ఈ బ్యాటరీ 10 నుంచి 70 శాతం ఛార్జింగ్‌కు కేవలం ఐదు నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది. 9 నిమిషాల్లో 97 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుందని పేర్కొంది.

వేడి పెరగకుండా నియంత్రణ
అతి వేగంగా ఛార్జింగ్‌ చేస్తే బ్యాటరీలో భారీగా వేడి పుడుతుంది. ఇది బ్యాటరీ పనితీరు, జీవితకాలంపై ప్రభావం చూపే ప్రధాన సమస్య. కొత్త టెక్నాలజీలో వేగంగా ఛార్జింగ్‌ చేసినా బ్యాటరీ ఉష్ణోగ్రతను నియంత్రించగలిగేలా రూపొందించినట్లు సన్‌వోడా చెబుతోంది.

మైనస్‌ 20 డిగ్రీల్లోనూ ఛార్జింగ్‌
చలికాలంలోనూ ఈ బ్యాటరీ పనితీరు తగ్గదని కంపెనీ పేర్కొంది. మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలోనూ 10 నుంచి 97 శాతం ఛార్జింగ్‌కు 15 నిమిషాలు పడుతుందని తెలిపింది. ఈ సమయంలో 700 కిలోమీటర్ల వరకు రేంజ్‌ పొందవచ్చని వెల్లడించింది.

10 ఏళ్లు.. 3 లక్షల కి.మీ. వారంటీ
సన్‌వోడా ఇప్పటికే గీలీ, డోంగ్‌ఫెంగ్‌, జీఏసీ వంటి చైనా వాహన తయారీ సంస్థలకు బ్యాటరీ సెల్స్‌ సరఫరా చేస్తోంది. కొత్త బ్యాటరీలు 10 ఏళ్లు లేదా 3 లక్షల కిలోమీటర్ల వారంటీ అవసరాలను తీర్చగలవని కంపెనీ చెబుతోంది. వేగవంతమైన ఛార్జింగ్‌పై ప్రత్యేక పరిమితులు ఉండవని పేర్కొంది.

ఈ సాంకేతికత వాస్తవ వినియోగంలోనూ కంపెనీ చెప్పిన స్థాయిలో పనిచేస్తే.. ఈవీ ఛార్జింగ్‌ రంగంలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Sunwoda EVB
Electric vehicle battery
Fast charging technology
LFP battery
EV charging innovation
China battery technology

More Telugu News