సన్నీ లియోన్ పై నమోదైన కేసును కొట్టేసిన కోర్టు

Sunny Leone cheating case dismissed by Mumbai court
  • తెలుగు సినిమా ఆఫర్ కు సంబంధించిన రూ. 1.75 కోట్ల లావాదేవీల కేసు
  • తనకు రావాల్సిన కమీషన్ చెల్లించకుండా మోసం చేశారంటూ ఓం ప్రకాశ్ జైన్ పిటిషన్
  • దీన్ని క్రిమినల్ కేసుగా పరిగణించలేమన్న కోర్టు

బాలీవుడ్ నటి సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్‌లకు ముంబై సెషన్స్ కోర్టులో భారీ ఊరట లభించింది. వారిపై నమోదైన చీటింగ్, క్రిమినల్, నమ్మకద్రోహం కేసును కోర్టు కొట్టివేసింది. ఒక తెలుగు సినిమా ఆఫర్ విషయంలో రూ. 1.75 కోట్ల లావాదేవీకి సంబంధించి, తనకు రావలసిన రూ. 70 లక్షలకు పైగా కమీషన్ బకాయిలు చెల్లించకుండా మోసం చేశారంటూ టాలెంట్ కోఆర్డినేటర్ ఓం ప్రకాశ్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది.


గతంలో ఇదే అంశంపై జైన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించగా... 2024 అక్టోబర్‌లో ఆ ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దానిని సవాలు చేస్తూ ఆయన దిండోషి అదనపు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కేసు విచారణలో భాగంగా పన్ను ఇన్వాయిస్‌లు, ఇతర పత్రాలను పరిశీలించిన అదనపు సెషన్స్ జడ్జి పి.ఏ. సానే.. ఈ వ్యవహారం కేవలం రెండు పక్షాల మధ్య జరిగిన వాణిజ్య లావాదేవీల ఒప్పందానికి సంబంధించినది మాత్రమేనని స్పష్టం చేశారు.


ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరగకపోవడం లేదా ఆర్థిక వివాదాలు తలెత్తడం వ్యాపారపరమైన ఉల్లంఘన మాత్రమే అవుతుందని, దానికి క్రిమినల్ నేరం (మోసం లేదా నమ్మకద్రోహం) రంగు పులమలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మొదటి నుంచే మోసం చేసే దురుద్దేశం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉంటేనే దానిని క్రిమినల్ కేసుగా పరిగణించవచ్చని పేర్కొంటూ ఓం ప్రకాశ్ జైన్ పిటిషన్‌ను కొట్టేస్తూ సన్నీ లియోన్ దంపతులను నిర్దోషులుగా పేర్కొన్నారు.

Advertisement
Sunny Leone
Daniel Weber
Mumbai Sessions Court
Cheating case dismissal
Om Prakash Jain
Bollywood legal news

More Telugu News