తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'ప్యార్ ప్రేమ కాదల్' సినిమాకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన 'ఎలెన్', తాను హీరోగా 'ప్యార్ ప్రేమ కల్యాణం' సినిమాను తెరకెక్కించాడు. శాన్వి మేఘన కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా అందుబాటులో ఉంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఎలెన్ (ఎలెన్) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. తల్లి .. తండ్రి .. బామ్మ ఇదే అతని కుటుంబం. ఎలెన్ దుబాయ్ లో కొంతకాలం జాబ్ చేస్తాడు. తండ్రి చేసిన అప్పుడు తీర్చేసిన తరువాత, ఇక వాళ్లకి దూరంగా ఉండలేక ఇండియాకి తిరిగొచ్చేస్తాడు. జీవితంలో అతను స్థిరపడతాడని అనుకుంటే, అలా మధ్యలో వచ్చేయడం ఆయన తండ్రి రాజశేఖర్ (భాస్కర్)కి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో సాధ్యమైనంత త్వరగా జాబ్ చూసుకోమని చెప్పి, ఎలెన్ కి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతాడు.
ఈ నేపథ్యంలోనే పరిచయమైన పవిత్ర (శాన్వీ మేఘన)తో ఎలెన్ ప్రేమలో పడతాడు. పవిత్రకి తల్లిదండ్రులతో పాటు, వీల్ చైర్ కి పరిమితమైన ఒక తాతయ్య ఉంటాడు. ఆమె జీతమే ఆ ఫ్యామిలీకి ఆధారం. ఎలెన్ కి ఇంకా ఎక్కడా జాబ్ రాదు. అయినా అతను పవిత్రను పెళ్లి చేసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతుండటం రాజశేఖర్ కి అసహనాన్ని కలిగిస్తుంది. అయినా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, ఎలెన్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు.
పవిత్రకి తన మెడలో తాళి బొట్టు పడటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పగింతల కార్యక్రమం జరుగుతూ ఉండగా, ఒక్కసారిగా పవిత్ర అక్కడి నుంచి పరుగందుకుంటుంది. అతికష్టం మీద ఆమె వెంటపడి పట్టుకుంటాడు ఎలెన్. సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టమనీ, అయితే అమ్మాయే అత్తవారింటికి వెళ్లాలనే పద్ధతి తనకి నచ్చలేదని ఎలెన్ తో తేల్చి చెబుతుంది. తన పట్ల ఇష్టం ఉంటే, తన ఇంటికి అతను రావొచ్చునని అంటుంది. అందుకు అంగీకరించి ఇల్లరికం వెళ్లిన 'ఎలెన్'కి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేదే కథ.
పెళ్లైన తరువాత ఆడపిల్ల అత్తవారింటికి వెళ్లడమనేది అనాదిగా వస్తోంది. అయితే తాను పుట్టిపెరిగిన వాతావరణం .. తన ఇల్లు .. తల్లిదండ్రులను వదిలి వెళ్లలేని పవిత్ర, తన భర్త తనతో పాటు తన ఇంట్లో ఉండాలని భావిస్తుంది. పవిత్ర పట్ల ప్రేమతో ఎలెన్ అందుకు అంగీకరిస్తాడు. పవిత్ర తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.
సాధారణంగా చాలా లవ్ స్టోరీస్, పీటలపై నుంచి పెళ్లికూతురు పారిపోవడంతో మొదలవుతాయి. అయితే ఇక్కడ తాళి కట్టించుకుని .. తలంబ్రాలు పోయించుకుని .. అప్పగింతల కార్యక్రమంలో పెళ్లి కూతురు పారిపోవడం ఈ కథలో కొత్తగా అనిపిస్తుంది. ఈ సీన్ తో కథను మొదలుపెట్టి, ఆడియన్స్ లో ఆసక్తిని పెంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇల్లరికం అల్లుడితో చాకిరీ చేయించాలనే ఉద్దేశంతో పవిత్ర తల్లి, తన కొడుకును వెనక్కి తెచ్చుకోవాలనే ఆలోచనతో ఎలెన్ తల్లి పన్నే వ్యూహాలు అలరిస్తాయి.
ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి కథ మరింత పుంజుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి వినోదం .. సందేశం కలిసి నడవడం మొదలుపెడతాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. అయితే యోగిబాబు మిత్ర బృందం వైపు నుంచి కామెడీని పరుగులు తీయించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా కసరత్తు చేయకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది.
ప్రతి పాత్ర కథలో భాగమవుతుంది. కథనం ఆ పాత్రలను ఎక్కడా వదిలేయకుండా ముందుకు తీసుకుని వెళుతుంది. నటీనటులంతా సన్నివేశాలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. దినేశ్ బాబు ఫొటోగ్రఫీ .. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం .. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ ఫరవాలేదు.
ఆచారాలు .. సంప్రదాయాలు అనుభవంలో నుంచే పుట్టుకొస్తాయి. వాటికి వ్యతిరేకంగా వ్యవహరించడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే అంశానికి వినోదాన్ని జోడిస్తూ సందేశాన్ని అందించిన తీరు ఆకట్టుకుంటుంది. కథలో కొత్తదనం లేకపోయినా కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసం యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూడొచ్చు.
'ప్యార్ ప్రేమ కల్యాణం' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Pyaar Prema kalyanam Review
Movie Details
Movie Name: Pyaar Prema kalyanam
Genre: Comedy, Romance
Release Date: 2026-08-21
Cast: Elan,Saanve Megghana,Radikaa Sarathkumar,M S Bhaskar,Yogi Babu, Geetha Kailasam
Director: Elan
PRO: -
Music: Yuvan Shankar Raja
Banner: Rise East Entertainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer