నేపాల్ వరదల ప్రాంతాన్ని సురక్షితంగా దాటాం: డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి
- ప్రస్తుతం నేపాల్ పర్యటనలో ఉన్న సతీశ్ రెడ్డి
- మానససరోవర్ యాత్ర నిమిత్తం ముందుకు సాగుతున్నామని వెల్లడి
- పూర్తి సురక్షితంగా ఉన్నామన్న డీఆర్డీఓ మాజీ చైర్మన్
నేపాల్‌లో సంభవించిన ఘోర ఆకస్మిక వరదలు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఈ ఘోర విపత్తుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అందరినీ కలచివేస్తున్నాయి. మరోవైపు నేపాల్‌లో ఉన్న డీఆర్డీఓ మాజీ చైర్మన్ జి. సతీశ్‌రెడ్డి తమ క్షేమ సమాచారాన్ని వెల్లడించారు. తాము నేపాల్‌లో పూర్తి సురక్షితంగా ఉన్నామని, ప్రస్తుతం మానససరోవర్ యాత్ర నిమిత్తం ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాన్ని తాము సురక్షితంగా దాటుకుని వెళ్లామని చెప్పారు.
అయితే మరోవైపు నేపాల్‌ను ముంచెత్తిన ఈ ఆకస్మిక జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపింది. విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం వరదల ఉద్ధృతికి ఇప్పటివరకు 826 మంది ఆచూకీ గల్లంతయ్యారు. అంతేకాకుండా, వరద ప్రవాహంలో దాదాపు 300 మంది వరకు భారతీయులు కొట్టుకుపోయినట్లు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ ప్రకటన చేశారు. ఈ దారుణ విపత్తులో మృతుల సంఖ్య ఇప్పటికే 175కి చేరుకోగా, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశాయి.