అర్ధ శతాబ్దపు సుదీర్ఘ ప్రయాణం: 50వ ఏట అడుగుపెట్టిన 'రాయలసీమ ఎక్స్‌ప్రెస్'
- 49 ఏళ్ల సుదీర్ఘ సేవలను పూర్తి చేసుకున్న రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- 1977లో మీటర్ గేజ్ పట్టాలపై సాధారణ సర్వీసుగా సేవలను ప్రారంభించిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్
- కొత్త రైళ్లు, వందేభారత్ లు వచ్చినా ఈ రైలుకు తగ్గని క్రేజ్
దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఒక అరుదైన, చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. 49 ఏళ్ల సుదీర్ఘ సేవలను విజయవంతంగా పూర్తి చేసుకుని, ఈ రైలు ఇప్పుడు 50వ సంవత్సరం (అర్ధ శతాబ్దం)లోకి అడుగుపెట్టింది. 1977లో మీటర్ గేజ్ పట్టాలపై అత్యంత సాధారణ సర్వీసుగా ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ రైలు ఐదు పదుల కాలంలో పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యంత నమ్మకమైన 'పేదల బండి'గా నిలిచింది.
కాలక్రమేణా ప్రయాణికుల నుంచి వచ్చిన భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ రైలును హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పొడిగించింది. అంతేకాకుండా సాధారణ ఎక్స్‌ప్రెస్ నుంచి సూపర్ ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్ చేయడమే కాక, ఆధునిక ఎల్హెచ్‌బి (LHB) కోచ్‌లతో పాటు శక్తివంతమైన ఇంజన్లను అమర్చారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా 890 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని ప్రతిరోజూ విజయవంతంగా చేరుకుంటోంది.
తరాలు మారుతున్నా, ఆధునిక సాంకేతికతతో ఎన్ని వందే భారత్, ఇతర కొత్త రైళ్లు వచ్చినా రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కున్న క్రేజ్, ఆదరణ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా తాండూరుతో పాటు పలు ప్రాంతాల ప్రజలతో ఈ రైలుకు విడదీయరాని ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు రాష్ట్రాల ప్రజల రవాణా అవసరాలను తీరుస్తూ, ఆత్మీయ బంధాన్ని పెనవేసుకున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ 50వ ఏట ప్రవేశించడంపై రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.