ఆర్థిక వృద్ధిలో రంగారెడ్డి జోరు.. దేశంలోని కీలక ప్రాంతాల జాబితాలో చోటు

Rangareddy surges in economic growth finds place among key Indian regions
  • వేగంగా ఎదుగుతున్న ప్రాంతాల్లో రంగారెడ్డికి చోటు
  • జైపుర్‌, నాసిక్‌, సూరత్‌తో పాటు రంగారెడ్డి ప్రస్తావన
  • దేశంలో ఆర్థికంగా కీలక మెట్రోగా పుణెకు అగ్రస్థానం
  • మెట్రో నగరాల్లో వృద్ధి వేగంలో కోల్‌కతా ముందంజ
  • అభివృద్ధి చెందుతున్న నగరాల్లో సౌత్‌ 24 పరగణాస్‌ టాప్‌
దేశంలో ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న ప్రాంతాల్లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చోటు దక్కింది. జైపుర్‌, నాసిక్‌, సూరత్‌, ముర్షిదాబాద్‌తో పాటు రంగారెడ్డి తన ఆర్థిక ప్రాధాన్యాన్ని పెంచుకుంటున్నట్లు ‘డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌’ తాజా నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి ఇక సంప్రదాయ మెట్రో నగరాలకే పరిమితం కాకుండా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని తెలిపింది.

‘డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ సిటీ వైటాలిటీ ఇండెక్స్‌’ ప్రకారం దేశంలో అత్యంత ఆర్థికంగా కీలకమైన మెట్రో నగరంగా పుణె నిలిచింది. ఐటీ సేవలు, అధునాతన తయారీ, ఆటోమొబైల్‌, విద్య, ఆవిష్కరణ ఆధారిత కార్యకలాపాలు పుణెకు కలిసొచ్చాయి. అహ్మదాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. మెట్రో నగరాల్లో ఆర్థిక వృద్ధి వేగం విషయంలో కోల్‌కతా ముందుంది.

ఏప్రిల్‌-జూన్‌ 2026 కాలానికి రూపొందించిన సూచీలో దేశవ్యాప్తంగా 800కుపైగా జిల్లాలను పరిశీలించారు. ఉపగ్రహ ఆధారిత భౌగోళిక పరిశీలన డేటాతో పాటు ఆర్థిక సూచీలను ఇందుకు ఉపయోగించారు. 

అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో సౌత్‌ 24 పరగణాస్‌ అగ్రస్థానంలో నిలిచింది. నార్త్‌ 24 పరగణాస్‌, థానే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జైపుర్‌, నాసిక్‌, సూరత్‌, ముర్షిదాబాద్‌, రంగారెడ్డి ప్రాంతాలు కూడా తమ ఆర్థిక ప్రాధాన్యాన్ని పెంచుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దిమాపూర్‌, పంచమహల్స్‌, ఆనంద్‌, అయోధ్య, రాంపుర్‌, బస్తీ, షామ్లీ, బౌధ్‌, ఔరంగాబాద్‌, కోడెర్మా వంటి జిల్లాలు స్థిరమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేశాయి.

దేశంలో పట్టణీకరణ మరింత విస్తృతంగా జరుగుతోందని నివేదిక పేర్కొంది. పెట్టుబడులు, వ్యాపారాలు, ప్రతిభావంతులైన మానవ వనరులు, మౌలిక వసతులు కొత్త నగరాల వైపు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపింది. భవిష్యత్‌ పెట్టుబడులకు ఈ కొత్త వృద్ధి మార్గాలు కీలకంగా మారనున్నాయని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ అభిప్రాయపడింది.
Advertisement
Rangareddy
Telangana Economic Growth
Dun and Bradstreet Report
City Vitality Index
India Fastest Growing Districts
Urbanization in India

More Telugu News