కరవుపై డ్రామాలు ఆపి వాస్తవాలు చూడండి: జగన్‌కు కాల్వ శ్రీనివాసులు హితవు

Kalava Srinivasulu slams Jagan over Rayalaseema drought politics and irrigation funds
  • రాయలసీమ కరవును అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయం చేస్తున్నారన్న కాల్వ
  • ఐదేళ్ల పాలనలో సీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది కేవలం రూ.2 వేల కోట్లేనని వెల్లడి
  • జీవో 365తో 102 రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేశారని ఆరోపణ
  • రెండేళ్లలో హంద్రీనీవాకు కూటమి రూ.5,050 కోట్లు ఖర్చు చేసిందని స్పష్టీకరణ
  • ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు జగన్ పత్రికలను వాడుకుంటున్నారని ఆగ్రహం
రాయలసీమలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను అడ్డం పెట్టుకుని వై‌సీపీ అధినేత జగన్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తీవ్రంగా విమర్శించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీమ ప్రయోజనాలను ఏనాడూ పట్టించుకోని జగన్, ఇప్పుడు కరవుపై డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు.

తమ ఐదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కాల్వ ఆరోపించారు. మరోవైపు, 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.12,441 కోట్లు ఖర్చు చేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.13,500 కోట్లకు పైగా ఖర్చు చేసిందని వివరించారు. ఈ బడ్జెట్‌లో మరో రూ.10,014 కోట్లు కేటాయించిందని వివరించారు.

గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 365 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 198 ప్రాజెక్టులను ప్రీ-క్లోజర్ చేస్తే, అందులో 102 ప్రాజెక్టులు ఒక్క రాయలసీమలోనే ఉన్నాయని కాల్వ శ్రీనివాసులు గుర్తుచేశారు. హంద్రీనీవా విస్తరణ, వేదవతి, గుండ్రేవులు, హెచ్‌ఎల్‌సీ కాలువ ఆధునికీకరణ వంటి కీలక ప్రాజెక్టులను రద్దు చేసి జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హంద్రీనీవాకు ఇప్పటికే రూ.3,850 కోట్లు ఖర్చు చేసిందని, ఈ ఏడాది మరో రూ.1,180 కోట్లు కేటాయించామని తెలిపారు. జగన్ రద్దు చేసిన మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులను తిరిగి ప్రారంభించామని స్పష్టం చేశారు.

ప్రస్తుత కరవు ప్రపంచవ్యాప్త సమస్య అని, ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని 12 రాష్ట్రాల్లోని 315 జిల్లాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కృష్ణా జలాల విషయంలోనూ జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, ‘తెలంగాణ నీళ్లు తోడేస్తుంటే బాబు మౌనం’ అని సాక్షిలో, ‘కృష్ణా జలాల్లో ఏపీ దోపిడి’ అని నమస్తే తెలంగాణలో పరస్పర విరుద్ధ కథనాలతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిబంధనల ప్రకారమే నీటి కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు సమర్థ నీటి నిర్వహణ వల్లే గత ఏడాది నీటిని నిల్వ చేసుకుని ఈరోజు కొంత వెసులుబాటు కలిగిందని, 2027 జూలై వరకు తాగునీటి అవసరాలకు నీటిని నిల్వ చేస్తున్నామని తెలిపారు. ఈ కష్టకాలంలో రాజకీయాలు మాని, రైతులకు, ప్రజలకు అండగా నిలవాలని జగన్‌కు హితవు పలికారు.


Advertisement
Kalava Srinivasulu
Jagan Mohan Reddy
Rayalaseema Irrigation Projects
Andhra Pradesh Drought Politics
Handri Neeva Project
TDP YCP Water Dispute

More Telugu News