పార్లమెంట్‌ను నవ్వులపాలు చేస్తున్నారు: డీలిమిటేషన్, 'ఒకే దేశం-ఒకే ఎన్నికల'పై చిదంబరం ధ్వజం

P Chidambaram slams Delimitation and One Nation One Election proposal
  • సరైన చర్చలు లేకుండానే పార్లమెంటులో బిల్లులు ఆమోదించుకున్నారన్న చిదంబరం
  • ఎంపీగా ఉండటం కన్నా ఎమ్మెల్యేగా ఉండటమే మేలనిపిస్తోందని వ్యాఖ్య
  • సామాజిక సేవ చేసే క్రైస్తవ, ముస్లిం సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారని మండిపాటు

పార్లమెంట్ పనితీరు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిదంబరం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వర్షాకాల సమావేశాల్లో సరైన చర్చలు లేకుండానే బిల్లులను ఆమోదించుకున్నారని ఆయన ఆరోపించారు. రోజురోజుకూ పార్లమెంట్‌ను గేలి చేస్తూ, నవ్వులపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్న చర్చలను చూస్తుంటే.. ఎంపీగా ఉండటం కన్నా ఎమ్మెల్యేగా ఉండటమే మేలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.


విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణలను ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సామాజిక సేవ చేసే క్రైస్తవ, ముస్లిం సంస్థలను లక్ష్యంగా చేసుకుని... వారి నిధులు, ఆస్తులను లాక్కునేందుకే ఈ చట్ట సవరణను తీసుకొస్తున్నారని విమర్శించారు. ఒక ప్రభుత్వం ఈ రకంగా ప్రజల లేదా సంస్థల ఆస్తులను దోచుకోకూడదని, ఇది అత్యంత దారుణమైన చట్టాలలో ఒకటిగా నిలుస్తుందని మండిపడ్డారు.


అలాగే జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అన్యాయమైన చర్యను దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్ పార్టీలు కూడా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 'ఒకే దేశం - ఒకే ఎన్నికలు' ప్రతిపాదన భారత రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని, ఇది ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానాన్ని పూర్తిగా చిన్నభిన్నం చేస్తుందని వ్యాఖ్యానించారు.

Advertisement
P Chidambaram
One Nation One Election
Delimitation South India
FCRA Amendment Act
Indian Parliament
Congress Party

More Telugu News