హైదరాబాద్-అమరావతి: పక్కపక్కనే హైస్పీడ్ రైల్.. 12 వరుసల ఎక్స్‌ప్రెస్ వే!

Hyderabad Amaravati High Speed Rail and 12 Lane Expressway to be built side by side
  • హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు, ఫ్యూచర్ సిటీ-బందరు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం
  • రెండు ప్రాజెక్టులు ఒకదానికొకటి సమాంతరంగా నిర్మాణం
  • రెండు మార్గాలకు కలిపి ఒకేసారి భూసేకరణ చేపట్టేందుకు ప్రణాళిక
  • ఫ్యూచర్ సిటీ, అమరావతి, బందరు పోర్టు మధ్య కనెక్టివిటీ బలోపేతం
  • ఎడమవైపు రోడ్డు, కుడివైపు రైలు మార్గం ఉండేలా అలైన్‌మెంట్ ఖరారు
హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, బందరు పోర్టులను అనుసంధానించేలా రెండు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమాంతరంగా పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్వే లైన్, ఫ్యూచర్ సిటీ-బందరు పోర్టు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను పక్కపక్కనే నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా అంగీకరించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్-విజయవాడ ప్రస్తుత జాతీయ రహదారికి ఎడమవైపు ఎక్స్‌ప్రెస్‌వే, కుడివైపు హైస్పీడ్ రైలు మార్గం ఉండేలా అలైన్‌మెంట్ ఖరారు చేశారు.

760 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గం
హైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య ప్రతిపాదించిన ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణ పరిధిలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. ఈ మార్గంలో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2.24 లక్షల కోట్లు కాగా, దాదాపు 790 హెక్టార్ల భూమి అవసరమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఈ మార్గంలో మార్కింగ్ పనులు పూర్తయ్యాయి.

298 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్యలో ఉన్న ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం కానుంది. ఇది అమరావతి మీదుగా మచిలీపట్నం-బందరు పోర్టుకు అనుసంధానమవుతుంది. మొత్తం 297.82 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్లు (40 గ్రామాల మీదుగా), ఏపీలో మిగిలిన భాగం (60 గ్రామాల మీదుగా) విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

ఈ రెండు భారీ ప్రాజెక్టులకు వేర్వేరుగా కాకుండా ఒకేసారి భూసేకరణ చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. ఒకే కారిడార్‌లో రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం వల్ల భూసేకరణ భారం తగ్గడమే కాకుండా, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, బందరు పోర్టుకు ప్రయాణ, సరుకు రవాణా సమయం గణనీయంగా ఆదా కానుంది. 
Advertisement
Hyderabad Amaravati High Speed Rail
Hyderabad Bandar Port Expressway
Mucherla Future City
Greenfield Expressway
Telangana AP Infrastructure
High Speed Rail Corridor

More Telugu News