వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేయొద్దు!

WhatsApp users warning do not open these files
  • వాట్సాప్ మాల్‌వేర్ దాడి నుంచి 10,000 మంది భారతీయులకు రక్షణ
  • జిప్ ఫైల్స్ పంపి ఖాతాలను హైజాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు
  • విండోస్ కంప్యూటర్లలోకి ట్రోజన్ వైరస్ పంపిస్తున్న వైనం
  • మాల్‌వేర్ సర్వర్లను బ్లాక్ చేసి దాడిని అడ్డుకున్న ఐ4సీ
  • ఢిల్లీ, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన కేసులు
దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా భారతీయులను లక్ష్యంగా చేసుకున్న భారీ వాట్సాప్ మాల్‌వేర్ దాడిని విజయవంతంగా అడ్డుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) చేపట్టిన సమన్వయ చర్యల ద్వారా ఈ ముప్పును నివారించినట్లు తెలిపింది.

కొంతకాలంగా వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారంటూ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై రంగంలోకి దిగిన ఐ4సీ దర్యాప్తు చేపట్టగా సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆర్‌బీఐ లేదా ఎంసీఏ వంటి ప్రభుత్వ సంస్థల నుంచి పంపినట్లుగా 'Statement of Account.zip' లేదా 'RBI.zip' వంటి పేర్లతో వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్‌కు హానికరమైన ఫైల్స్‌ను పంపుతున్నారు.

ఈ జిప్ ఫైల్స్‌ను విండోస్ కంప్యూటర్‌లో ఓపెన్ చేసినప్పుడు, సిస్టమ్‌లోకి ఒక ట్రోజన్ వైరస్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇది వెంటనే కంప్యూటర్‌ను తన ఆధీనంలోకి తీసుకుని, యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్‌ను హైజాక్ చేస్తుంది. ఆ తర్వాత హ్యాక్ చేసిన ఖాతా నుంచే బాధితుడి కాంటాక్టులు, గ్రూపులకు ఆటోమేటిక్‌గా అవే మాల్‌వేర్ ఫైల్స్ వెళుతున్నాయి.

ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో 'సహయోగ్ పోర్టల్' ద్వారా మాల్‌వేర్‌కు సంబంధించిన కమాండ్-అండ్-కంట్రోల్ సర్వర్లను జియో-బ్లాక్ చేసి ఈ దాడిని నిలువరించినట్లు హోం శాఖ వివరించింది. ఇలాంటి మోసాలపై ఐ4సీ గత జూన్ 22నే ఒక హెచ్చరిక జారీ చేసింది.
Advertisement
WhatsApp Malware
I4C Cyber Crime
Indian Home Ministry
WhatsApp Web Hijack
Trojan Virus Alert
Cyber Security India

More Telugu News