‘మోడరేట్‌ హిందువు’ నుంచి ‘మేల్కొన్న హిందువు’గా మారా: కంగనా

Kangana Ranaut changed from Moderate Hindu to Awakened Hindu
  • పాత వీడియోలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో వ్యాఖ్యలు
  • హిందుత్వంపై తన ఆలోచనల్లో వచ్చిన మార్పును వివరిస్తూ ఇన్‌స్టా వీడియో
  • నచ్చిన భావజాలాన్ని ఎంచుకునే స్వేచ్ఛ హిందూ మహిళలకూ ఉండాలని వ్యాఖ్య
  • తాను సంఘ్‌ భావజాలాన్ని స్వీకరించాలనుకుంటున్నానని వెల్లడి
తాను ఒకప్పుడు ‘మోడరేట్‌ హిందువు’నని, ఇప్పుడు ‘మేల్కొన్న హిందువు’గా మారానని బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల తన పాత వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. హిందుత్వంపై తన ఆలోచనల్లో వచ్చిన మార్పును వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు.

పార్లమెంట్‌కు వెళ్లే ముందు తన మనసులోని భావాలను పంచుకోవాలనిపించిందని కంగనా రనౌత్‌ వీడియోలో చెప్పారు. సినీ పరిశ్రమలో చాలా మంది హిందూ మహిళలు రాజకీయాలు, మతం వంటి అంశాలపై స్పష్టమైన భావజాలం లేకుండా తటస్థంగా ఉంటారని అన్నారు. యువతలో ఇలాంటి ధోరణి సాధారణమేనని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఇస్లామిస్టులతో పరిచయం పెరిగిన తర్వాత వారి ఆలోచనలు మారి వామపక్ష భావజాలం వైపు వెళ్తారని ఆమె ఆరోపించారు.

భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన మతాన్ని, భావజాలాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చిందని కంగనా అన్నారు. అదే స్వేచ్ఛ హిందూ మహిళలకు కూడా ఉండాలని పేర్కొన్నారు. తాను గతంలో ‘మోడరేట్‌ హిందువు’గా ఉండేదాన్నని, ఇప్పుడు మాత్రం ‘మేల్కొన్న హిందువు’గా మారాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లా క్రమశిక్షణతో కూడిన హిందుత్వ భావజాలాన్ని స్వీకరించాలనుకుంటున్నానని వెల్లడించారు.

‘‘నేను సంఘ్‌ భావజాలాన్ని స్వీకరించాలనుకుంటున్నాను. మేల్కొన్న హిందువుగా మారాలనుకుంటున్నాను. నాకు ఆ హక్కు ఎందుకు ఉండకూడదు? ఇతరులు తమ భావజాలాన్ని మార్చుకోవచ్చని చెబుతారు. అయితే హిందూ మహిళలు తమ ఆలోచనలను మార్చుకోవడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు?’’ అని కంగనా ప్రశ్నించారు. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

కొన్ని రోజుల క్రితం యువతను ఉద్దేశించి ‘‘గట్టర్‌ ఛాప్‌’’ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారి తీశాయి. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సోషల్‌ మీడియాలో కొందరు ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Advertisement
Kangana Ranaut
BJP MP
Awakened Hindu
Hindutva Ideology
RSS
Moderate Hindu

More Telugu News