Advertisement

నీట్ యూజీ 2026: ఆగస్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం

NEET UG 2026 Counseling starts from August 4
  • నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్టీఏ
  • ఆగస్టు 4 నుంచి ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ప్రారంభం
  • సెప్టెంబర్ 8 నుంచి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల తరగతులు
  • సెలవుల్లోనూ పనిచేయాలని మెడికల్ కాలేజీలకు ఆదేశాలు
నీట్ యూజీ-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం ప్రకటించింది. దీని ప్రకారం, ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి ఆగస్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల విద్యా సంవత్సరం (అకడమిక్ సెషన్) సెప్టెంబర్ 8 నుంచి మొదలవుతుందని స్పష్టం చేసింది.

తొలి రౌండ్‌లో ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు జరుగుతుంది. ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఆగస్టు 23న వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇక రాష్ట్రాల కోటా మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు నిర్వహిస్తారు.

రెండో రౌండ్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే, ఆల్ ఇండియా కోటా ప్రక్రియ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు, రాష్ట్రాల కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతుంది.

నిర్దేశిత షెడ్యూల్‌ను సకాలంలో పూర్తి చేసేలా శని, ఆదివారాలు మరియు ఇతర సెలవు దినాల్లోనూ పనిచేయాలని అన్ని మెడికల్ కాలేజీలను ఎన్‌టీఏ ఆదేశించింది. తదుపరి రౌండ్లు, స్ట్రే వేకెన్సీలతో కలిపి అక్టోబర్ 10 నాటికి ప్రవేశాల ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం 47 మంది ఎన్‌టీఏ అధికారులను విధుల నుంచి తొలగించి, చట్టపరమైన చర్యలు చేపట్టింది. అనంతరం నిర్వహించిన రీ-టెస్ట్ ఫలితాలను జులై 16న ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.
Advertisement
NEET UG 2026
NTA
Medical Counseling Schedule
All India Quota
MBBS Admissions
National Testing Agency

More Telugu News