రూ.1,249కే జియో కొత్త ట్రాకర్‌.. ఫీచర్లు ఏంటంటే..!

Jio new tracker for Rs 1249 what are the features
  • భారత్‌లో జియోట్యాగ్‌ 2 విడుదల
  • గూగుల్‌ ఫైండ్‌ హబ్‌, యాపిల్‌ ఫైండ్‌ మై సపోర్ట్‌
  • రూ.1,249 ధరతో అమెజాన్‌లో విక్రయం
  • 120 డెసిబెల్‌ బజర్‌, లాస్ట్‌ మోడ్‌ ఫీచర్‌
  • సిమ్‌, డేటా ప్లాన్‌ అవసరం లేదు
  • ఏడాది బ్యాటరీ, ఐపీ64 రేటింగ్‌
జియో తన స్మార్ట్‌ ట్రాకర్‌కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చింది. జియోట్యాగ్‌ 2 పేరుతో విడుదల చేసిన ఈ కొత్త డివైజ్‌లో తొలిసారిగా గూగుల్‌ ఫైండ్‌ హబ్, యాపిల్‌ ఫైండ్‌ మై రెండింటికీ సపోర్ట్‌ చేసేలా రూపొందించింది. దీంతో ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులు ఒకే ట్రాకర్‌ను ఉపయోగించుకునే అవకాశం లభించింది. క్రాస్‌ ప్లాట్‌ఫామ్‌ సపోర్ట్‌తో పాటు మరిన్ని కొత్త ఫీచర్లను కూడా జియో ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చింది.

భారత్‌లో జియోట్యాగ్‌ 2 ధర రూ.1,249గా నిర్ణయించారు. బ్లాక్‌, గ్రీన్‌, రెడ్‌ రంగుల్లో ఈ ట్రాకర్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్‌ ఇండియాలో కొనుగోలు చేయొచ్చు. 2023లో విడుదలైన తొలి జియోట్యాగ్‌కు ఇది అప్‌గ్రేడ్‌ వెర్షన్‌. ఈసారి ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ రెండింటితోనూ పనిచేసేలా కంపెనీ రూపొందించింది.

తాళాలు, బ్యాగ్‌లు, పర్స్‌లు, లగేజీ వంటి వస్తువులకు ఈ ట్రాకర్‌ను అమర్చుకోవచ్చు. వస్తువు కనిపించకపోతే ఆండ్రాయిడ్‌లో గూగుల్‌ ఫైండ్‌ హబ్‌, ఐఫోన్‌లో యాపిల్‌ ఫైండ్‌ మై యాప్‌ల ద్వారా దాని స్థానాన్ని గుర్తించవచ్చు. బ్లూటూత్‌ లో ఎనర్జీ టెక్నాలజీతో పనిచేసే ఈ పరికరంలో 120 డెసిబెల్‌ల శబ్దంతో బిల్ట్‌-ఇన్‌ బజర్‌ను కూడా ఏర్పాటు చేశారు. వస్తువు సమీపంలో ఉంటే యాప్‌ నుంచే బజర్‌ను మోగించి సులభంగా గుర్తించే వీలుంటుంది.

బ్లూటూత్‌ పరిధి దాటినా సమీపంలోని అనుకూల ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ పరికరాల సహాయంతో కమ్యూనిటీ నెట్‌వర్క్‌ ద్వారా ట్రాకర్‌ స్థానాన్ని గుర్తించవచ్చని జియో తెలిపింది. ఇందులో లాస్ట్‌ మోడ్‌ ఫీచర్‌ను కూడా అందించారు. సిమ్‌ కార్డు, మొబైల్‌ డేటా ప్లాన్‌ అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. మార్చుకునే బ్యాటరీతో ఏడాది వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. బాక్స్‌లో అదనంగా మరో బ్యాటరీని కూడా ఇస్తోంది. ఐపీ64 రేటింగ్‌తో ధూళి, నీటి చినుకుల నుంచి రక్షణ కల్పించారు. పాలీకార్బొనేట్‌ బాడీతో రూపొందించిన ఈ ట్రాకర్‌ను కీచైన్‌, బ్యాగ్‌లకు సులభంగా అమర్చుకునేలా డిజైన్‌ చేశారు.
Advertisement
JioTag 2
Jio Smart Tracker
Google Find My Device
Apple Find My
JioTag 2 Price India
Bluetooth Tracker

More Telugu News