లైవ్ టీవీలో కునుకు తీసిన అమెరికన్ యాంకర్.. ట్రోలింగ్ బదులు ఊహించని మద్దతు

Dominique Dillon falls asleep on live TV and receives unexpected support instead of trolling
  • ఈ ఘటనను ఓ ప్రేక్షకుడు రికార్డ్ చేయడంతో వీడియో వైరల్
  • ట్రోలింగ్ బదులు యాంకర్‌కు అనూహ్యంగా మద్దతు  
  • ఇద్దరు పిల్లల తల్లి కావడం, ఉదయం షిఫ్ట్‌లు కష్టమంటూ సానుభూతి
  • జర్నలిస్టుల పనివేళలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ
అమెరికాలోని ఓ న్యూస్ యాంకర్ లైవ్ ప్రసారంలో ఉండగా అనుకోకుండా కునుకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె విమర్శల పాలవుతారని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా నెటిజన్ల నుంచి ఆమెకు పూర్తి మద్దతు లభించింది. ఇది చాలా సహజమని, ఆమెను తప్పుబట్టాల్సిన అవసరం లేదని ప్రేక్షకులు అండగా నిలిచారు. ఈ సంఘటన జర్నలిస్టుల పని ఒత్తిడి, వారి వ్యక్తిగత జీవితంపై కొత్త చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే.. టెన్నెస్సీలోని ‘ఫాక్స్ 13 మెంఫిస్’ న్యూస్ ఛానెల్‌లో యాంకర్, రిపోర్టర్‌గా పనిచేస్తున్న డొమినిక్ డిల్లాన్ ‘గుడ్ మార్నింగ్ మెంఫిస్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లైవ్ ప్రసారంలో భాగంగా తన వంతు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆమె అలసటతో తలను చేతుల్లో పెట్టుకుని కళ్లు మూసుకున్నారు. సరిగ్గా అదే సమయానికి కెమెరా ఆమె వైపు తిరగడంతో ఈ దృశ్యం రికార్డయింది.

ఈ ఘటనను టీవీలో చూస్తున్న ఓ ప్రేక్షకుడు తన ఫోన్‌లో రికార్డ్ చేసి.. "చూశారా! డొమినిక్ డిల్లాన్ లైవ్‌లో నిద్రపోతూ దొరికిపోయింది" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. తొలుత కొందరు నవ్వుకున్నప్పటికీ, ఆ తర్వాత చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు.

సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటూ కామెంట్లు పెట్టారు. "ఆమె ఇద్దరు పిల్లల తల్లి, పైగా ఉదయం షిఫ్ట్‌లు అది మర్చిపోవద్దు" అని ఒకరు పేర్కొనగా, "ఉదయాన్నే చేసే షిఫ్టులు చాలా కఠినంగా ఉంటాయి. ఆమె మనిషే కానీ రోబో కాదు కదా. ఆమెను ప్రశాంతంగా వదిలేయండి" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ సంఘటన ఒక వృత్తిపరమైన లోపం కాదని, ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సహజమైన మానవ క్షణమని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.

ఈ వైరల్ వీడియోతో న్యూస్ ప్రొఫెషనల్స్ ఎదుర్కొనే సవాళ్లు, వారి కఠినమైన పనివేళలపై విస్తృత చర్చ మొదలైంది. లైవ్ ప్రసారాల కోసం వారు అసాధారణ సమయాల్లో పనిచేయాల్సి ఉంటుందని, అలసిపోవడం సహజమని చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఘటనపై డొమినిక్ డిల్లాన్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించనప్పటికీ, ఆమె సహోద్యోగులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఆమె తన పని పట్ల ఎంతో అంకితభావంతో ఉండే జర్నలిస్ట్ అని వారు పేర్కొన్నారు.
Advertisement
Dominique Dillon
Fox 13 Memphis
Good Morning Memphis
News anchor falls asleep on live TV
Journalist work pressure
Viral news anchor video

More Telugu News