భారత ఐటీ రంగానికి కొత్త హెచ్చరిక.. హెచ్‌సీఎల్‌ టెక్‌తో ఒప్పందంలో గూగుల్‌ కోత

HCLTech faces 50 million dollar revenue drop as Google scales back deal
  • హెచ్‌సీఎల్‌టెక్‌ ఒప్పందాన్ని ఏటా 5 కోట్ల డాలర్లు తగ్గించిన గూగుల్‌
  • ఏఐ, ఆటోమేషన్‌తో అవుట్‌సోర్సింగ్‌లో మార్పులు
  • వెయ్యి మంది ఉద్యోగుల పునర్విభజనకు అవకాశం
  • భారీ ఉద్యోగ కోతలు ఉండవని సంకేతాలు
ఏఐ ప్రభావం ఐటీ రంగంపై మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు భారీ మానవ వనరులపై ఆధారపడిన ప్రాజెక్టులు ఇప్పుడు ఆటోమేషన్‌, కృత్రిమ మేధతో కొత్త రూపం దాలుస్తున్నాయి. ఈ మార్పులో భాగంగా గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దకాలంగా హెచ్‌సీఎల్‌టెక్‌తో కొనసాగుతున్న ఒప్పందాన్ని కుదిస్తూ కొత్త సంకేతాలు ఇచ్చింది. అయితే ఉద్యోగుల తొలగింపుల కంటే పనుల పునర్విభజనకే కంపెనీ ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అయితే భారత ఐటీ రంగానికి ఈ పరిణామాన్ని కొత్త హెచ్చరికగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

గూగుల్‌ తన అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ సేవల్లో భాగంగా హెచ్‌సీఎల్‌టెక్‌కు అప్పగించిన అవుట్‌సోర్సింగ్‌ ఒప్పందాన్ని ఏడాదికి ఐదు కోట్ల డాలర్ల మేర తగ్గించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ ఒప్పందం విలువ గతంలో ఏటా సుమారు 20 కోట్ల డాలర్లుగా ఉండేది. ఇప్పుడు దాని పరిధిని కుదించడంతో హెచ్‌సీఎల్‌టెక్‌కు వచ్చే వార్షిక ఆదాయంలో 5 కోట్ల డాలర్ల తగ్గుదల ఉండొచ్చని అంచనా. ఇది కంపెనీ మొత్తం వార్షిక ఆదాయంలో సుమారు 0.3 శాతం మాత్రమే.

ఈ నిర్ణయం వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాల కోత ఉండదని సమాచారం. గూగుల్‌ ప్రాజెక్టుపై పనిచేస్తున్న దాదాపు వెయ్యి మంది హెచ్‌సీఎల్‌టెక్‌ ఉద్యోగులను ఇతర ప్రాజెక్టులకు మార్చనున్నట్లు తెలుస్తోంది. ఏఐ, క్లౌడ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన కొత్త పనుల్లో వీరిని వినియోగించే అవకాశం ఉంది. నైపుణ్యం కలిగిన సిబ్బందిని కొనసాగిస్తూ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు మార్చడం ఐటీ రంగంలో పెరుగుతున్న ధోరణిగా నిపుణులు చెబుతున్నారు.
Advertisement
HCLTech
Google
Indian IT sector
AI automation
IT outsourcing contract
Digital transformation

More Telugu News