అథ్లెట్లను అభినందించలేదేం?.. రాహుల్‌ గాంధీని ప్రశ్నించిన బాక్సర్ విజేందర్ సింగ్

Vijender Singh questions Rahul Gandhi for not congratulating Indian athletes
  • కామన్వెల్త్ గేమ్స్ విజేతలపై రాహుల్ గాంధీ మౌనాన్ని ప్రశ్నించిన విజేందర్ సింగ్
  • రాజకీయాలకు అతీతంగా క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని పెంచాలని సూచన
  • కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల ప్రదర్శనపై రాహుల్ స్పందించకపోవడంపై అసంతృప్తి
  • గ్లాస్గో క్రీడల్లో 7 స్వర్ణాలు సహా 10 పతకాలు సాధించిన భారత బాక్సింగ్ జట్టు 
  • మొత్తం 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్
ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ రాహుల్ గాంధీ నుంచి కనీసం ఒక్క అభినందన సందేశం కూడా రాకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. క్రీడా విజయాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని హితవు పలికారు.

ఈ మేరకు విజేందర్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో ఒక పోస్ట్ చేశారు. "రాహుల్ గాంధీ జీ, కాంగ్రెస్ పార్టీ తరచూ దేశ యువత గురించి మాట్లాడుతుంది. కానీ కామన్వెల్త్ గేమ్స్‌లో మన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిస్తే మీ నుంచి ఒక్క అభినందన సందేశం కానీ, ట్వీట్ కానీ రాలేదు. దేశ యువత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్నప్పుడు, మనం కూడా రాజకీయాలకు అతీతంగా వారి నైతిక స్థైర్యాన్ని పెంచడం మనందరి బాధ్యత" అని విజేందర్ తన పోస్టులో పేర్కొన్నాడు.

గ్లాస్గోలో ముగిసిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా భారత బాక్సింగ్ జట్టు 7 స్వర్ణాలు, 3 రజతాలతో కలిపి 10 పతకాలు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలోనే విజేందర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అంతకుముందు, భారత బాక్సర్ల చరిత్రాత్మక విజయంపై విజేందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. బాక్సింగ్ జట్టు కఠోర శ్రమ, పట్టుదల దేశం గర్వపడేలా చేశాయని కొనియాడాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ కాంస్యం గెలిచి, బాక్సింగ్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ పతకాన్ని అందించాడు.
Advertisement
Vijender Singh
Rahul Gandhi
Commonwealth Games 2026
Indian Boxing Team
Indian Athletes
Indian National Congress

More Telugu News