బుమ్రా ఔట్‌.. జమ్మూకశ్మీర్‌ యువ పేసర్‌కు టెస్టు పిలుపు

Bumrah out Jammu and Kashmir young pacer receives Test call up
  • గాయంతో శ్రీలంక సిరీస్‌కు బుమ్రా దూరం
  • అకీబ్‌ నబీకి తొలి టెస్టు పిలుపు
  • రంజీలో రెండు సీజన్లలో 104 వికెట్లు
  • జమ్మూకశ్మీర్‌కు తొలి టెస్టు క్రికెటర్‌గా రికార్డు
  • భారత్‌-ఏ తరఫున శ్రీలంకలో ఆరు వికెట్లు
  • ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్‌
దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్‌ అకీబ్‌ నబీకి భారత టెస్టు జట్టులో తొలి అవకాశం లభించింది. శ్రీలంకతో సిరీస్‌కు గాయంతో జస్‌ప్రీత్‌ బుమ్రా దూరం కావడంతో అతడి స్థానంలో సెలెక్టర్లు నబీని ఎంపిక చేశారు. దీంతో భారత పురుషుల టెస్టు జట్టుకు ఎంపికైన తొలి జమ్మూకశ్మీర్‌ క్రికెటర్‌గా అకీబ్‌ నబీ రికార్డు సృష్టించాడు.

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. బుమ్రా ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సిరీస్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన బుమ్రా ఫిట్‌నెస్‌ సాధిస్తేనే జట్టులో కొనసాగుతాడని ముందే బీసీసీఐ ప్రకటించింది. అయితే పూర్తిగా కోలుకోకపోవడంతో అతణ్ని తప్పించి అకీబ్‌ నబీకి అవకాశం కల్పించింది.

29 ఏళ్ల కుడిచేతి ఫాస్ట్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అకీబ్‌ నబీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌తో ఈ అవకాశాన్ని అందుకున్నాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి జమ్మూకశ్మీర్‌కు తొలి టైటిల్‌ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. గత రెండు రంజీ సీజన్లలో కలిపి 104 వికెట్లు సాధించి తన స్థిరమైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అదే ఫామ్‌ ఇప్పుడు జాతీయ జట్టులో చోటు కల్పించింది.

దేశవాళీ ప్రదర్శన ఆధారంగా ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున కూడా నబీకి అవకాశం దక్కింది. ఐదు మ్యాచ్‌లు ఆడినా వికెట్లు మాత్రం సాధించలేకపోయాడు. ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న అతడు ఆరు వికెట్లు తీశాడు. ఆ సిరీస్‌ను భారత్‌ 1-0తో గెలుచుకుంది. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు నెట్‌ బౌలర్‌గా భారత జట్టుతో ఉన్న అనుభవం కూడా అతడికి ఉంది.

అకీబ్‌ నబీ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో దులీప్‌ ట్రోఫీ కోసం సాధన చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి ముంబై చేరుకుని భారత జట్టుతో కలవనున్నాడు. ఆ తర్వాత జట్టు కొలంబోకు బయలుదేరుతుంది. ఆగస్టు 7 నుంచి 9 వరకు మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడిన తర్వాత గాలేలో జరిగే తొలి టెస్టులో బరిలోకి దిగుతుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో జరుగుతుంది. ఈ సిరీస్‌లో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌తో కలిసి నబీ భారత పేస్‌ దళంలో భాగం కానున్నాడు.
Advertisement
Aqib Nabi
Jasprit Bumrah
India vs Sri Lanka
Jammu and Kashmir Cricket
Indian Cricket Team
BCCI

More Telugu News