'బాలన్ - ది బాయ్' మలయాళంలో రూపొందిన సినిమా. జూన్ 19న విడుదలైన ఈ సినిమా, ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేశారు. అందుకు కారణం ఈ దర్శకుడు గతంలో తీసిన సినిమా 'మంజుమ్మల్ బాయ్స్' కావడమే. ఆ సినిమాను ఆడియన్స్ ఇప్పటికీ మరిచిపోలేదు. చిదంబరం తెరకెక్కించిన మరో సినిమానే 'బాలన్ - ది బాయ్'. అలాంటి ఈ సినిమా, జులై 31 నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

అది ఒక సెంట్రల్ జైల్ .. మహిళా నేరస్థులు మాత్రమే శిక్షను అనుభవించే జైలు అది. ఆ జైల్లో మహిళా ఖైదీల మధ్య ఒక మహిళ (ఫర్జానా) కొంతకాలంగా శిక్షను అనుభవిస్తూ ఉంటుంది. జైల్లోనే ఆమె ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ పిల్లాడి పేరే 'బాలన్' (ఆదిశేషన్) తల్లితో పాటే ఆ కుర్రాడు జైల్లో పెరుగుతూ ఉంటాడు. వేశ్య వృత్తిని కొనసాగించే   'షమ్నమ్'(బీనా ఆంటోని) కూడా అదే జైల్లో ఉంటుంది. అక్కడి నుంచి విడుదలైనవారిని వేశ్య వృత్తిలోకి దింపడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది.

జైలు నుంచి 'బాలన్' తల్లి విడుదలవుతూ ఉండటంతో, ఆమెను కూడా వేశ్య వృత్తిలోకి దింపడానికి షమ్నమ్ స్కెచ్ వేస్తుంది. తాను ఎవరన్నదీ .. ఎక్కడి నుంచి బయటికి వచ్చిందన్నది ఈ ప్రపంచానికి తెలియకూడదని బాలన్ తల్లి భావిస్తుంది. తమ ఊరు .. తమ పేరు ఎప్పటికప్పుడు మారుస్తూ, సరైన గమ్యస్థానాన్ని వెతుక్కుంటూ ఆమె ప్రయాణం కొనసాగిస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే ఆమె తన కొడుక్కి, తమ పరిస్థితి అర్థమయ్యేలా కథలుగా చెప్పుకుంటూ వెళుతుంది. తమ గురించి ఎవరికీ చెప్పకూడదనేది ఆరేళ్ల ఆ కుర్రాడికి అర్థమైపోతుంది.

బాలన్ తల్లికి ఒక ఇంట్లో పని దొరుకుతుంది. ఊరికి దూరంగా .. అడవికి దగ్గరగా ఉన్న ఇల్లు అది. అక్కడ ఒక బామ్మ మాత్రమే ఉంటుంది. ఆమె కొడుకు ఇంగ్లాండ్ లో ఉంటాడు. కొన్ని కారణాల వలన, కొడుకు పట్ల ఆమె కోపంగా ఉంటుంది. అయినా  అతను నెలకి ఒకసారి కాల్ చేస్తూ ఉంటాడు. వీల్ చైర్ కి పరిమితమైన ఆమె, రక్షణ కోసమని ఒక 'గన్' దగ్గర పెట్టుకుంటుంది. బాలన్ తల్లి గతం ఏమిటనేది గ్రహించిన ఆ బామ్మ ధైర్యం చెబుతుంది. హఠాత్తుగా ఆమె చనిపోవడం బాలన్ తల్లికి మళ్లీ బ్రతుకు పై భయాన్ని కలిగిస్తుంది. 

బామ్మను రహస్యంగా పూడ్చేసిన బాలన్ తల్లి, ఆమె చనిపోయిన విషయాన్ని కొడుకు దగ్గర దాచేస్తుంది. జైలు నుంచి విడుదలైన   'షమ్నమ్, బాలన్ తల్లి ఎక్కడ ఉంటున్నది పసిగట్టి  వెతుక్కుంటూ వస్తుంది.   'షమ్నమ్  ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న బాలన్ తల్లి, ఆమెను చంపేస్తుంది. ఆ హత్య జరిగిన సమయంలోనే, విదేశాల నుంచి ఆ బామ్మ కొడుకు వస్తాడు. అప్పుడు బాలన్ తల్లి ఏం చేస్తుంది? అసలు ఆమె గతం ఏమిటి? స్కూల్ కి వెళ్లిన బాలన్ తిరిగొచ్చేసరికి తల్లి ఏమౌతుంది? తన తల్లిని చేరుకోవడానికి అతను ఏం చేస్తాడు? అనేదే కథ.

జైలు శిక్షను అనుభవిస్తూ అక్కడే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఒక తల్లి, ఆ తరువాత విడుదలవుతుంది. తన గతం తన బిడ్డ జీవితాన్ని ప్రభావితం చేయకూడదని ఆమె భావిస్తుంది. అందుకోసం పేర్లు మార్చుకుంటూ, గమ్యం తెలియని ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఆ ప్రయాణంలో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఒకరి కోసం ఒకరు ఆ తల్లీ కొడుకులు ఎలాంటి పరిస్థితులను ఎదిరించారు? అనే ప్రధానమైన అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. 

ఈ ప్రపంచం తడబడే వాళ్లను చూసి నవ్వుతూనే ఉంటుంది .. బెదిరిపోయే వాళ్లను భయపెడుతూనే ఉంటుంది .. పారిపోయేవాళ్లను తరుముతూనే ఉంటుంది. అలాంటి ప్రపంచానికి తామెవరన్నది తెలియకుండా .. తమ ఉనికి తెలియకుండా ఒక తల్లి తన కొడుకును పెంచాలని అనుకుంటుంది. అందుకోసం ఆమె ఏం చేసిందనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం. దానిని ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు.

ఒక బిడ్డపై తల్లి మాటల ప్రభావం ఎలా ఉంటుందో .. ఒక బిడ్డకు తల్లి మాత్రమే అర్థమయ్యేలా చెప్పగలదు అనడానికి నిదర్శనమే ఈ సినిమా. తల్లిని చేరుకోవాలని బిడ్డపడే ఆరాటం .. బిడ్డను చూడాలని తల్లిపడే తపన ఆడియన్స్ ను కదలనీయకుండా చేస్తాయి. ఒకరి నిరీక్షణ .. మరొకరి అన్వేషణ చుట్టూ ఈ కథ పరిగెడుతుంది. ఈ కథలో ఈ రెండు పాత్రలే ప్రధానం. ఆ తరువాత కీలకమైన పాత్రలో 'టోవినో థామస్' కనిపిస్తాడు. మిగతా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటాయి.

తల్లిగా ఫర్జానా .. కొడుకుగా ఆదిశేషన్ నటన ఈ సినిమాకి హైలైట్. ఎక్కువగా మాట్లాడకుండా చూపులతోనే భావాలు పలికించడం తల్లి పాత్రకు అవసరం. అందువలన విశాలమైన కళ్లున్న ఆర్టిస్టును తీసుకున్నారు.  తల్లి కళ్లను పోలిన ఆరేళ్ల కుర్రాడిని .. అచ్చు అలాంటి కళ్లు కలిగిన టీనేజ్ కుర్రాడిని ఎంపిక చేయడం దర్శకుడి ఆలోచనా శక్తికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.షైజు ఖలీద్ ఫొటోగ్రఫీ .. సుషీన్ శ్యామ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. వివేక్ హర్షన్ ఎడిటింగ్ ఫరవాలేదు.

ఈ కథ చాలా నిదానంగా మొదలై .. మనలను తనతో పాటు తీసుకుని వెళుతుంది. తల్లి కొడుకులతో పాటు మనలను కూడా జర్నీ చేయిస్తుంది. వాళ్లతో పాటు మనలను ఆందోళనకు ..  ఆవేదనకు గురిచేస్తుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ అవుతాయి. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ .. ఎమోషన్స్ .. ట్విస్టులు కట్టిపడేస్తాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ సినిమాగా 'బాలన్' కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన సినిమా ఇది.