కుంభవృష్టి ఖాయం, ప్రాణనష్టం తప్పదు.. ఉజ్జయిని రంగంలో అమ్మవారి హెచ్చరిక!

Torrential rain is certain loss of life inevitable Goddess warning in Ujjaini Rangam
  • లష్కర్ బోనాల్లో కీలకమైన రంగం కార్యక్రమం
  • ఈసారి తీవ్ర ఆగ్రహంతో ఉన్నానన్న ఉజ్జయిని మహంకాళి
  • కుంభవృష్టి, అగ్నిప్రమాదాలు తప్పవని హెచ్చరిక
  • ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయాలని అమ్మవారి ఆదేశం
  • తప్పితే భారీ ప్రాణనష్టం తప్పదని భవిష్యవాణి
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు అత్యంత కీలకమైన 'రంగం' కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మాతంగి స్వర్ణలత పచ్చి మట్టికుండపై నిలబడి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది తాను తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నానని అమ్మవారు తన వాణిలో హెచ్చరించారు. ప్రజల ప్రవర్తన తనను కంటతడి పెట్టిస్తోందని, మనశ్శాంతి లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

భవిష్యవాణిలో స్వర్ణలత మాట్లాడుతూ.. "నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేదు. అయినా ప్రజలను నేను కాపాడుతూనే ఉన్నా. ఏ ఆపద వచ్చినా అడ్డుకుంటున్నా. కానీ నా మాట మీరు వినడం లేదు. ఇది నాకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ ఏడాది కుంభవృష్టి రూపంలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయని, వాటి వల్ల ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు వావివరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఘోరాలు చేస్తున్నారు. వారిని నేను వదిలిపెట్టను" అని చెప్పారు.

తనకు ఇచ్చిన మాట ప్రకారం రాబోయే ఆరు నెలల్లోగా విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలని అమ్మవారు ఆదేశించారు. అలా చేయని పక్షంలో భారీ ప్రాణనష్టం జరిపిస్తానని హెచ్చరించారు. "నాకు అడ్డు వచ్చిన వాళ్లను పాదాల కింద వేసి నలిపేస్తా. మీరు గాలికి వదిలేసిన పిల్లల్ని నేను కాపాడుతా. కానీ మీరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు" అంటూ స్వర్ణలత అమ్మవారి వాణిని వినిపించారు.

అంతకుముందు నిన్న‌ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలతో సందడిగా మారింది. ప్రతి ఏటా రంగంలో వెలువడే భవిష్యవాణికి భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి అమ్మవారి హెచ్చరికలు భక్తుల్లో చర్చనీయాంశంగా మారాయి.
Advertisement
Ujjaini Mahankali Temple
Lashkar Bonalu
Matangi Swarnalatha
Rangam Predictions 2024
Telangana Heavy Rains
Secunderabad Bonalu Rangam

More Telugu News