భారత్‌పై అంత ప్రేమ ఉంటే దుబాయ్‌లో ఎందుకు ఉంటున్నారు?: వివేక్ ఒబెరాయ్, మాధవన్‌లపై రాజ్ థాకరే వ్యాఖ్యలు
- మోదీ పాలనను ప్రశంసించే వివేక్ ఒబెరాయ్, మాధవన్ దుబాయ్‌లో ఉంటున్నారన్న రాజ్ థాకరే
- దేశం గొప్పగా మారిందని నమ్మితే విదేశాల్లో ఎందుకు స్థిరపడుతున్నారని ప్రశ్న
- ఎవరూ దిగజారుడు భాష మాట్లాడకూడదన్న మోదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానన్న థాకరే
ప్రధాని మోదీ పాలనలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడుతున్న నటులు వివేక్ ఒబెరాయ్, మాధవన్‌లు దేశంలో ఉండకుండా దుబాయ్‌లో ఎందుకు స్థిరపడ్డారని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) అధినేత రాజ్ థాకరే ప్రశ్నించారు. ముంబైలో జరిగిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ విద్యార్థి సేన 20వ వార్షికోత్సవ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ బయోపిక్‌లో నటించిన వివేక్ ఒబెరాయ్, ఆయన పాలనను ప్రశంసించే మాధవన్ ఇద్దరూ తమ కుటుంబాలతో కలిసి దుబాయ్‌లో నివాసముంటున్నారని రాజ్ థాకరే విమర్శించారు. "మోదీ పాలనలో దేశం చాలా గొప్పగా మారిందని నమ్మితే, విదేశాల్లో ఎందుకు స్థిరపడుతున్నారు? భారతదేశానికి వచ్చి ప్రభుత్వ మద్దతు ఉన్న సినిమాల్లో నటించి, ఆ వెంటనే మళ్లీ దుబాయ్ వెళ్లిపోతున్నారు" అని ఆయన ఎద్దేవా చేశారు. వ్యాపారవేత్తలు, యువత కూడా దేశంలోని నగరాల్లో సరైన మౌలిక వసతులు లేక విదేశాలకు వెళ్లిపోతున్నారని ఆరోపించారు.
"బీజేపీ ట్రోల్ బృందాలే ముందుగా మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ నుంచి థాకరే కుటుంబం వరకు అందరినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ప్రారంభించాయి" అని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీకేజీ సమస్య విద్యార్థుల ఆగ్రహానికి కేవలం ఒక నెపమేనని, ఏళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తే ఈ భారీ ఆందోళనలకు కారణమని ఆయన పేర్కొన్నారు.