మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో తీర్పు.. నిర్దోషిగా బ్రిజ్ భూషణ్‌

Brij Bhushan Sharan Singh gets clean chit in female wrestlers sexual harassment case
  • మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు ఊరట
  • ఆయన్ను నిర్దోషిగా ప్రకటించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు
  • సహ నిందితుడు వినోద్ తోమర్‌కు కూడా క్లీన్ చిట్
  • గౌరవప్రదంగా నిర్దోషిగా తేల్చిందన్న బ్రిజ్ భూషణ్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (డ‌బ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను, మరో నిందితుడు వినోద్ తోమర్‌ను నిర్దోషులుగా తేలుస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నేడు తీర్పు వెలువరించింది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు తెరపడినట్లయింది.

తీర్పు వెలువడిన వెంటనే బ్రిజ్ భూషణ్ 'ఎన్డీటీవీ'తో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "నాపై ఆరోపణలు వచ్చిన రోజే చెప్పాను.. అవి రుజువైతే ఉరి వేసుకుంటానని. ఈ రోజు కోర్టు నన్ను గౌరవప్రదంగా నిర్దోషిగా తేల్చింది. జరిగిందేదో జరిగిపోయింది" అని ఆయన వ్యాఖ్యానించారు.

డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా ఉన్నప్పుడు బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పలువురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణ పూర్తి చేసిన అనంతరం 2023 జూన్ 15న సుమారు 1500 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.

భారత రెజ్లింగ్ సమాఖ్య అధిపతిగా ఉన్న సమయంలో స్వదేశీ, విదేశీ మహిళా రెజ్లర్ల పట్ల బ్రిజ్ భూషణ్ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఆయనను, సహ నిందితుడు వినోద్ తోమర్‌ను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.
Advertisement
Brij Bhushan Sharan Singh
WFI sexual harassment case
Delhi Rouse Avenue Court
Female wrestlers protest
Vinod Tomar
Wrestling Federation of India

More Telugu News