రావణ్ అరెస్ట్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali Nani sensational comments on YouTuber Ravan arrest
  • రావణ్‌ను కొత్త చట్టం తెచ్చి జైలుకు పంపించారన్న కొడాలి నాని
  • చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణను రావణ్ ఒక మాట కూడా అనడని వ్యాఖ్య
  • పవన్ కల్యాణ్‌పై పోస్టులు పెట్టినందుకే జనసేన శ్రేణులు కక్షకట్టి కేసులు పెట్టాయని ఆరోపణ

యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా కొత్త కొత్త చట్టాలు తెచ్చి జైల్లో బంధిస్తున్నారు. ప్రజల నోరు నొక్కేందుకు ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ప్రయత్నిస్తోంది" అని కొడాలి నాని మండిపడ్డారు. రావణ్‌ను ఏకంగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటూ ఏదో ఒక కొత్త చట్టాన్ని (UAPA చట్టాన్ని ఉద్దేశించి) తెరపైకి తెచ్చి జైలుకు పంపించారని ఆయన ఎద్దేవా చేశారు.


వైసీపీని 'గొడ్డలి పార్టీ' అని చంద్రబాబు, లోకేశ్, వారి అనుకూల మీడియా సంబోధిస్తోందని కొడాలి నాని మండిపడ్డారు. "మాది గొడ్డలి పార్టీ కాదు. పేదల పక్షాన నిలిచే సంక్షేమ పార్టీ. నిజానికి నీది 'బూడిద పార్టీ'. ఇది 'బూడిద ప్రభుత్వం' అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లను పోలీస్ స్టేషన్లలో పెట్టి తగలబెట్టి బూడిద చేసే రకం మీది. రాబోయే రోజుల్లో మీ పార్టీకి, మీకు ఆ బూడిదే మిగులుతుంది" అని తీవ్రంగా హెచ్చరించారు.


రావణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడేం కొత్తవి కావని... గతంలో సీఎంలు, డిప్యూటీ సీఎంలుగా ఉన్నవారే అంతకంటే భయంకరమైన భాష వాడారని నాని అన్నారు. "గత ఏడాది కాలంగా పవన్ కల్యాణ్‌పై రావణ్ పోస్టులు పెడుతున్నాడు. అందుకే కక్ష కట్టి జనసేన శ్రేణులు అతనిపై కేసులు పెట్టి, స్టేషన్ల చుట్టూ తిప్పి దాడులకు దిగారు. కోర్టులు బెయిల్ ఇస్తుండటంతో తట్టుకోలేక, ఈ దొంగ చట్టాలు తెచ్చి లోపల వేశారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా మీద రావణ్ విమర్శలు చేశాడు. కానీ, మేమెప్పుడూ ఇలా అణచివేయాలని చూడలేదు" అని చెప్పారు.


రావణ్‌ను వైసీపీ మనిషిగా చిత్రీకరించేందుకు తెలుగుదేశం అనుకూల 'పేటీఎం బ్యాచ్' మీడియా ప్రయత్నిస్తోందని కొడాలి నాని ఆరోపించారు. "రావణ్ ఎప్పుడూ చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణలకు అనుకూలంగానే ఉంటాడు. వారిని ఒక్క మాట కూడా అనడు. అందుకే టీడీపీ సైలెంట్‌గా ఉంది. కానీ ఏబీఎన్ రాధాకృష్ణను, టీవీ5 బీఆర్ నాయుడిని, మహాన్యూస్ ఐబీఆర్లను తిట్టాడు. ఆ బూతులు తిట్టించుకున్న పచ్చ మీడియానే... ఇప్పుడు రావణ్‌పై లేనిపోని తప్పుడు వీడియోలు వండి వారుస్తూ, ఆ బురదను వైసీపీకి రుద్దాలని చూస్తోంది" అని కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు.

Advertisement
Kodali Nani
YouTuber Ravan
YSRCP
Chandrababu Naidu
Andhra Pradesh Politics
UAPA Arrest

More Telugu News