ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో 'జంగిల్ రాజ్' నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన కిరాతక దాడి ఘటన, టీడీపీ కూటమి పాలనలో నెలకొన్న అరాచక పరిస్థితులకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

"రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, తరగతి గదిలోనే ఒక విద్యార్థినిపై రంపంతో జరిగిన కిరాతక దాడి.. టీడీపీ కూటమి పాలనలో శాంతిభద్రతలు ఎంతగా విఫలమయ్యాయో స్పష్టం చేస్తోంది. ఒక ప్రభుత్వ పాఠశాలలోకి దుండగుడు స్వేచ్ఛగా ఎలా ప్రవేశించి, ఒక బాలికపై ఇంత దారుణంగా దాడి చేయగలిగాడు? విద్యాసంస్థల్లో కూడా పిల్లలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది" అని జగన్ పేర్కొన్నారు. బాధితురాలిని కాపాడే ప్రయత్నంలో మరో విద్యార్థిని కూడా గాయపడటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పాలనను పక్కనపెట్టి, రాజకీయ కక్ష సాధింపులు, 'రెడ్ బుక్' పాలనకే ప్రాధాన్యం ఇస్తోందని, దీనివల్లే నేరస్థులు చట్టమంటే భయం లేకుండా రెచ్చిపోతున్నారని జగన్ ఆరోపించారు. గాయపడిన విద్యార్థినులకు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించాలని, వారి కుటుంబాలకు ప్రభుత్వం ధైర్యం చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, పారదర్శక విచారణ ద్వారా కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలపై తక్షణమే సమీక్ష జరపాలని, ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేశ్ పూర్తి బాధ్యత వహించాలని జగన్ అన్నారు.

ఘటన వివరాలు, ప్రభుత్వ స్పందన

రాప్తాడులోని ఓ పాఠశాలలో శనివారం ఓ దుండగుడు తరగతి గదిలోకి ప్రవేశించి పదో తరగతి విద్యార్థినిపై ఎలోక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో విద్యార్థిని ముఖం, తల, గొంతు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కుడి చేయి దాదాపు తెగిపోయినట్లు సమాచారం. ఆమెను కాపాడబోయిన మరో విద్యార్థిని కూడా తీవ్రంగా గాయపడింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె కోలుకునే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్య బృందాన్ని ఆదేశించానని తెలిపారు. "ఈ ఘాతుకానికి పాల్పడిన మృగాడిని పట్టుకుని, చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించాను" అని చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం ఆయన బాధితురాలి తల్లితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఆయన ఆరా తీశారు. ఈ ఘటనను నారా లోకేశ్ కూడా తీవ్రంగా ఖండించారు.

ఈ ఘటనపై పోలీసులు విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.