ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయితే, విచారణ పూర్తయ్యే వరకు కెసిరెడ్డి దేశం విడిచి వెళ్లరాదని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని స్పష్టమైన షరతులు విధించింది.

ప్రొడక్షన్ వారెంట్ జారీని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్ట్ చేయబోమని కోర్టులో హామీ ఇచ్చాక కూడా ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయడంపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పులోని కొన్ని వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే, కేవలం ఆ కారణంతో నిందితుడికి మంజూరు చేసిన బెయిల్‌ను, స్వేచ్ఛను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. పోలీసులు నేరుగా చేసే అరెస్ట్‌కు, కోర్టు జారీ చేసే ప్రొడక్షన్ వారెంట్‌కు మధ్య వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించింది.

ముందస్తు అనుమతి లేకుండా నిందితుడిని మళ్లీ అరెస్ట్ చేయరాదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని 23వ పేరాను సుప్రీంకోర్టు సమర్థించింది. ఒకవేళ నిందితుడు దర్యాప్తునకు సహకరించని పక్షంలో, బెయిల్ రద్దు కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో కెసిరెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ కొనసాగనుంది.