ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతోందని, పోలీసులు తమ యూనిఫాంల కింద పచ్చ చొక్కాలు ధరించి టీడీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మాచర్లలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం... వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని పిన్నెల్లి ఆరోపించారు. టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. "మాచర్ల మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ అభ్యర్థిపై టీడీపీ గూండాలు రక్తం వచ్చేలా దాడి చేశారు. బీఫామ్ సమర్పించడానికి వెళ్లినప్పుడు ఓ గంజాయి బ్యాచ్ దాడి చేసి పత్రాలు చించివేసింది" అని ఆయన వివరించారు.

శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై 33 కేసులు నమోదు చేశారని, కానీ దాడులు చేసిన వారిని వదిలేశారని పిన్నెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, దీనిపై ఆధారాలతో ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. కారంపూడి, దుర్గి, వెల్దుర్తి, నాగార్జున సాగర్ ఎస్సైలు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, పోటీ నుంచి తప్పుకోకపోతే గంజాయి కేసులు పెడతామని అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

తమ ప్రభుత్వ హయాంలో మాచర్లలో 5,400 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, రింగ్ రోడ్డు నిర్మించామని, ఆసుపత్రిని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, బెయిల్ రద్దు చేస్తామని బెదిరించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక సిట్ ఏర్పాటు చేసి, ఈ అరాచకాలకు పాల్పడిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు.