గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమాకు (#RC17) ముహూర్తం ఖరారైంది. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'రంగస్థలం' తర్వాత మరోసారి జత కడుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 1న ఉదయం 10:50 గంటలకు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుంది.

ఈ సినిమా కోసం రామ్‌చరణ్‌ పూర్తిగా కొత్త మేకోవర్‌లోకి మారారు. ఇప్పటికే ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. మునుపెన్నడూ చూడని విధంగా బరువు తగ్గి, పొడవాటి జుట్టుతో చాలా స్టైలిష్‌గా ఆయన కనిపించనున్నారని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సరికొత్త లుక్ అభిమానులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని సమాచారం.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. 2027 జనవరి నుంచి రామ్‌చరణ్‌ ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు.

త్వరలోనే ఈ సినిమాలో నటించే హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.