అనంతపురం జిల్లా రాప్తాడులోని జడ్పీ హైస్కూల్‌లో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ఈ ఏర్పాట్లు చకచకా జరిగాయి. బాలికను బెంగళూరులోని ప్రఖ్యాత మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించి, అత్యుత్తమ వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు.

విషయం తెలిసిన వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్, విద్యార్థినిని బెంగళూరు తరలించడానికి ముందే మణిపాల్ ఆసుపత్రికి చెందిన ఉన్నతస్థాయి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వివరించి, సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించాలని వారిని కోరారు. అంతేకాకుండా, అంబులెన్స్ వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆసుత్రికి చేరుకునేందుకు వీలుగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వంతో మంత్రి లోకేశ్ నేరుగా సంప్రదింపులు జరిపారు.

దాడి ఘటన తెలిసిన క్షణం నుంచే మంత్రి లోకేశ్.. పోలీసు, విద్య, జిల్లా అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. ప్రతిక్షణం అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలికి మెరుగైన వైద్య సహాయం అందించడమే ఏకైక లక్ష్యంగా జిల్లా యంత్రాంగం, వైద్యులతో సమన్వయం చేసుకుంటూ బెంగళూరు తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.