విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు జైలు నుంచి విడుదలైన రోజును గుర్తుచేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున (అక్టోబరు 31) చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారని, ఆ రోజు నిజం గెలిచిందని, న్యాయం జరిగిందని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు లోకేశ్ శనివారం సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని లోకేశ్ ఆరోపించారు. "గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో, తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టయిన దార్శనిక నేత చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రోజు ఇది. 53 రోజుల పాటు కక్ష రాజకీయాలతో ఆయన్ను నిర్బంధించారు" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ప్రార్థనలు, అభిమానుల నమ్మకంతో చంద్రబాబు నిర్బంధం నుంచి బయటకు వచ్చిన ఆ రోజును తన జీవితంలో మర్చిపోలేనని ఆయన తెలిపారు.

కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారులు 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం ఆరోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 2023 అక్టోబరు 31న జైలు నుంచి విడుదలయ్యారు. ఆ ఘటన జరిగి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.