ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ వేదికను మారుస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. బెంగళూరులోని యలహంక నివాసంలో జరగాల్సిన పెళ్లి వేడుకను, వేరొక ప్రదేశంలో నిర్వహించనున్నట్లు ఆమె శనివారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వివాదాలకు తావివ్వకుండా, ప్రశాంతంగా వివాహం జరిపించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా షర్మిల తన ఆవేదనను పంచుకున్నారు. "నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నాకు, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం" అని స్పష్టం చేశారు.

"నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న వైఎస్ఆర్ తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెబుతుంది. కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం" అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

"వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి..  పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి  గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం" అని షర్మిల రాసుకొచ్చారు.