ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడుతోంది. ఇది రేపటికి తుపానుగా, ఆపై తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు దూసుకురానుంది. ఈ తుపాను నవంబర్ 3వ తేదీ ఉదయం నెల్లూరు, నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగాన్ని కూడా తాకొచ్చని హెచ్చరించింది.

ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం, గత 6 గంటల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ఈ (అక్టోబర్ 31) అర్ధరాత్రికి ఇది తీవ్ర వాయుగుండంగా, రేపటికి (నవంబర్ 1న) తుపానుగా, నవంబర్ 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

శనివారం సాయంత్రం 5:30 గంటల సమయానికి ఈ వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 980 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1,030 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంగా చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయనున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.