కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వారు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వై‌సీపీ నాయకురాలు రోజా తీవ్రంగా విమర్శించారు. నగరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బైక్‌ ర్యాలీ, ఓపెన్ టాప్ వాహన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ అధికార కూటమిపై విరుచుకుపడ్డారు.

"నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవాలి కానీ, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. నగరి మున్సిపల్ ఛైర్మన్ పదవిని కుట్రపూరితంగా ఏకగ్రీవం చేసుకున్నారు" అని రోజా ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తూ, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ ఏకగ్రీవానికి సహకరించారని ఆమె ఆరోపించారు. స్క్రూటినీలో ఆమోదం పొందిన తమ అభ్యర్థి నామినేషన్‌ను తర్వాత ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు.

ఈ ఏకగ్రీవాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశామని, తమకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని రోజా స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లుగా నగరిలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని, వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో సైకిల్‌ను తుక్కు తుక్కుగా ఓడించి, కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.