ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్, యూజర్ల ప్రైవసీకి సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. ఇకపై కుటుంబసభ్యులు, స్నేహితులు లేదా వ్యాపార సంస్థలతో చాట్ చేయడానికి ఫోన్ నంబర్‌ను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి బదులుగా ప్రత్యేకమైన 'యూజర్‌నేమ్' ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్టు మాతృసంస్థ మెటా సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మార్పు ద్వారా యూజర్ల ఫోన్ నంబర్ గోప్యతకు మరింత భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కంపెనీ స్పష్టం చేసింది.

సాధారణంగా పెద్ద గ్రూప్ చాట్‌లలో చేరినప్పుడు లేదా మొదటిసారి ఒక వ్యక్తికి గానీ, వ్యాపార సంస్థకు గానీ మెసేజ్ చేసినప్పుడు ఫోన్ నంబర్ ఆటోమేటిక్‌గా షేర్ అవుతుంది. ఈ కొత్త యూజర్‌నేమ్ విధానంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేయాలంటే, అవతలి వ్యక్తికి మీ కచ్చితమైన యూజర్‌నేమ్ తెలిసి ఉండాలి. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగా యూజర్‌నేమ్‌లను వెతకడానికి ఎలాంటి పబ్లిక్ డైరెక్టరీ కానీ, సెర్చ్ ఆప్షన్ కానీ ఉండదని మెటా తెలిపింది. ఇది అపరిచితుల నుంచి వచ్చే అనవసర మెసేజ్‌లను నివారిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్లకు పైగా యూజర్లు ఉన్నందున, చాలా మందికి తమకు నచ్చిన యూజర్‌నేమ్ వెంటనే దొరికే అవకాశం ఉండకపోవచ్చు. ఈ ఫీచర్‌ను రాబోయే కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని వాట్సాప్ వెల్లడించింది. ఆయా దేశాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినప్పుడు యూజర్లకు యాప్‌లోనే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తామని పేర్కొంది.

ఇదే సమయంలో క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు, ఇతర ఆర్గనైజేషన్లకు మెటా ఒక ప్రత్యేక సౌలభ్యం కల్పించింది. తమకు ఇప్పటికే ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న యూజర్‌నేమ్‌లనే వాట్సాప్‌లో కూడా రిజర్వ్ చేసుకునేందుకు (క్లెయిమ్ చేసుకునేందుకు) అనుమతిస్తామని తెలిపింది. ఈ మార్పు వాట్సాప్‌లో వ్యక్తిగత గోప్యతను మ‌రో స్థాయికి తీసుకెళ్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.